Mar 12,2023 12:27

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : టెక్నాలజీ పెరిగింది. ఎన్నో ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. తరతరాలుగా వస్తున్న అనేక వస్తువులు మాయమైపోతున్నాయి. కాని ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ వేసవిలో విసనకర్రల (చేతిపంకాలు)కు డిమాండ్‌ తగ్గడం లేదు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వంటివన్నీ వేసవిలో ఎంతో దోహదపడతాయి. అయితే వీటన్నిటికీ విద్యుత్తు మూలం. కాని ఇవేమీ లేకుండా అందరికీ వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనం ఇస్తాయి విసనకర్రలు. అందుకనే వాటికి ఆదరణ కొనసాగుతూ వస్తుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం వరకూ ఇవే అందరికీ చల్లటి గాలినిచ్చే ఉపకారణాలు. ఇవిలేని ఇల్లుండేది కాదు. కాలం మారుతుంది. ఆధునిక పరికరాల ద్వారా కృత్రిమ గాలిని పొందుతున్నారు. కానీ వీటినే నమ్ముకున్న పెద్ద వయస్సు వాళ్లు నేటికీ వాడుతూనే ఉంటారు. మిగిలిన కాలాల్లో ఒబ్బిడిగా ఓ చోట భద్రపరచినప్పటికీ వేసవిలో వాటిని బయటకు తీస్తారు. మరికొందరు కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కొనుగోలు, అమ్మకాల సీజన్‌ ప్రారంభమైంది. విజయనగరం ప్రాంతం నుంచి లారీలపై రాజమహేంద్రవరం సమీపంలో గల కడియం మండలం వేమగిరి జంక్షన్‌ కు తీసుకొచ్చి, అక్కడ నుంచి ఉభయ గోదావరి జిల్లాలో అమ్మకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో జరిగే సీతారాముల కళ్యాణాలలో విసనకర్రల పాత్ర కీలకంగా ఉంటుంది. చేతిలో విసనకర్ర లేకుండా ఈ కళ్యాణ మహౌత్సవం తిలకించడం కష్టమవుతుంది. అందుకునే ఉత్సవాలకు వచ్చే భక్తులకు కమిటీ వాళ్లు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు.