ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కాకినాడ ఎంపి వంగా గీత నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ గీత వదిన పుప్పాల కళావతి సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లోని స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంపి గీత అన్నయ్య కృష్ణకుమార్‌తో తనకు వివాహమైందని, తన ఆడపడుచులు ఎంపి వంగా గీత, ఆమె సోదరి కుసుకుమారి 2006లో తన భర్తకు సంబంధించిన ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు. 2010లో తన భర్త మరణించారని తెలిపారు. తమ ఆస్తులు గురించి పిల్లలు కోర్టులో పోరాడుతుంటే బెదిరిస్తున్నారని తెలిపారు. తమ కుటుంబాన్ని చంపాలని చూస్తున్నారని, ద్రాక్షారామం, కాకినాడల్లో తమకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో సర్పవరం పోలీస్ స్టేషన్‌తో పాటు సిఎం క్యాంప్ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నా ఎవరూ స్పందించలేదన్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నట్లు తెలిపారు. ఎంపి వంగా గీత, ఆమె భర్త విశ్వనాథం, గీత సోదరి కుసుమకుమారి, ఆమె భర్త కనకాల రవికుమార్ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. వారి నుంచి కాపాడాలని కోరారు.










