Sep 25,2023 13:05

మంగళగిరి (గుంటూరు) : సిఎం జగన్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని టిడిపి నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సోమవారం మంగళగిరిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్‌ అవినీతిని వివరిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ... సిఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుండి ప్రజల దగ్గర నుండీ లూఠీ చేశారని ఆరోపించారు. ఇప్పటికి 8సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచి ప్రజల జేబులను కొల్లగొడుతున్నారని అన్నారు. మద్యపానం నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన జగన్‌... ఈరోజు మద్యాన్నే తన ఆదాయంగా మార్చుకున్నారని అన్నారు. జగన్‌ తన సాక్షి పత్రికలో ప్రభుత్వ ప్రకటనల ద్వారా రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. జగన్‌పై కేసులున్నాయి కాబట్టి చంద్రబాబుపై కూడా కేసులుండాలనే కుట్రపూరితమైన కక్షతో చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు అవినీతి చేశారని ఎలాంటి రుజువు ఇంతవరకు చూపించలేకపోయారని అన్నారు.