Mar 05,2023 14:49

ప్రజాశక్తి-పీలేరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువ గళం పాదయాత్ర అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది. పీలేరు నియోజకవర్గం బాధ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు లోకేష్ కు స్థానిక ఎం జె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ఎర్రగుంటపల్లి పంచాయతీలో ఘనంగా స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని పులిచెర్ల మండలం, జ్యోతి నగర్ లో బసచేసిన యువ నేత నారా లోకేష్ ఆదివారం ఉదయం తన అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఆ కార్యక్రమం అనంతరం ఉదయం 10-55 నిమిషాలకు అక్కడి నుంచి ఆయన 35వ రోజు పాదయాత్రను మొదలుపెట్టారు. పీలేరు మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలోకి చేరుకున్న యువనేత యాత్రకు టిడిపి శ్రేణులు, అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులతో కలసి తెలుగు మహిళలు ఆయనకు హారతులు అందించి స్వాగతించారు. అక్కడ ఆయన మహిళలకు మాట్లాడిన అనంతరం పాదయాత్ర పీలేరు పట్టణ శివారులోని షఫీ పారడైజ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన యువనేత విడది కేంద్రానికి మధ్యాహ్నం 12-10 నిమిషాలకు చేరుకుంది. దారి పొడవునా జనం ఆయనకు జయజయ ధ్వనుల మధ్య స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గం ఇన్చార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగునూరు నియోజకవర్గం ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, పీలేరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి డాక్టర్ మల్లెల రెడ్డి బాష, నాయకులు కోటపల్లి బాబు రెడ్డి, రెడ్డప్ప రెడ్డి, పసుపులేటి లక్ష్మీకర్, అమర్నాథ్ రెడ్డి, రియాజ్ బాష, షౌకత్ బాష తదితర నాయకులు పాల్గొన్నారు.