Oct 14,2020 07:11

గత కొంత కాలంగా ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతత్వంలో పోలీసు రాజ్యం ఏలుబడిలో వుంది. తాజాగా జరిగిన హథ్రాస్‌ అత్యాచార ఘటన, అనంతరం మరణించిన బాధితురాలిని బంధువులకు తెలియకుండా పోలీసులు దహనం చేసిన తీరు ఇందుకు అద్దం పడుతోంది. యోగి ఆధ్వర్యంలో పెచ్చరిల్లుతున్న ఈ పోలీసు రాజ్యం...రాష్ట్రంలో హిందూత్వ మతతత్వం, అగ్ర కుల దురహంకారంతో కూడిన విషపూరిత మిశ్రమాన్ని అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు స్వయంగా ముఖ్యమంత్రే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అసలు యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి పదవికి ఎదగడం అనేది ఒక కుటిల గాథ. గోరక్‌పూర్‌ లోని గోరక్‌నాథ్‌ మఠానికి అధిపతిగా ఎంపికయిన యోగి 1998లో అక్కడి నుంచే బిజెపి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మఠాధిపతిగా ఉన్నంత కాలం బీభత్సం, హింసతో కొనసాగింది.
2002లో 'హిందూ యువ సేన'ను స్థాపించిన యోగి, ఆ సాయుధ వ్యక్తులకు వ్యక్తిగతంగా నేతృత్వం వహిస్తూ వారిని ముస్లిములపై దాడులు చేసేందుకు, స్మశానవాటికలను అపవిత్రం చేసేందుకు, అల్లకల్లోలం సృష్టించేందుకు వినియోగించేవారు. గోరక్షణ, లవ్‌ జిహాద్‌ను ఆపడం, ఘర్‌ వాపసీని నిర్వహించే పేరుతో ఈ దుర్మర్గాలకు పాల్పడ్డారు. తరువాతి కొన్ని సంవత్సరాలపాటు యోగిపై వేలాది క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యలు, మతపరమైన ప్రదేశాలను అపవిత్రం చేయడం, అయుధాలతో అల్లర్లు, బెదిరింపులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇటువంటి ఘోరమైన ఫాసిస్టు భావనలున్న వ్యక్తిని ప్రధాని మోడీ, అమిత్‌షాలు ఏరికోరి ఎంపిక చేసుకొని 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత... ఎన్నికల్లో పోటీ చేసి గెలవకున్నా ముఖ్యమంత్రిని చేశారు.
సి.ఎంగా యోగి ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే ఆయన మీదున్న కేసులన్నిటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇప్పడు తనకు తాను నేరరహితుడిగా చెప్పుకుంటూ...'నేరాలపై యుద్ధం' పేరుతో...ఎవరైతే నేరాలకు పాల్పడతారో, వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రకటించారు. ఇది, అనుమానిత నేరస్తులపై కూడా పోలీసులు ఎన్‌కౌంటర్లు ప్రారంభించవచ్చుననే సంకేతాలు ఇచ్చింది. 2017 నుంచి 2020 ఆగస్టు వరకూ పోలీసులు 6,476 ఎన్‌కౌంటర్లలో 125 మందిని కాల్చి చంపారు. దాదాపు వెయ్య మంది వరకూ గాయపడ్డారు. చనిపోయిన వారిలో 37 శాతం అంటే 45 మంది ముస్లిములే కావడం గమనార్హం.
పదిహేడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాక ఠాకూర్‌ కులానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ను 2017లో రక్షించాలని కోరినపుడు ఆదిత్యానాథ్‌ పాలనలో ఉన్న కుల పక్షపాతం ఆయనకు అండగా నిలిచింది. సెంగార్‌కు సంబంధించిన వారు చేసిన దాడితో గాయపడిన బాధితురాలి తండ్రి మరణించారు. అత్యాచార కేసుకు సంబంధించి ఒక సంవత్సరం అనంతరం హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత సింగార్‌ను అరెస్టు చేసి, కేసును సిబిఐకి అప్పగించిన తర్వాతనే ఇది జరిగింది. రేపిస్టు సెంగార్‌ను రక్షించేందుకు ముగ్గురు పోలీసు అధికారులు, ఒక ఐఎఎస్‌ ప్రయత్నించారని సిబిఐ విచారణలో తేలింది. అయినా వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
మతపరమైన పండుగలను నిర్వహించాలని పోలీసు స్టేషన్లకు పంపిన ఆదేశాలతో పోలీసులను, అధికార యంత్రాంగాన్ని మతతత్వం చేశారు. 2013లో జరిగిన ముజఫర్‌ నగర్‌ మత అల్లర్లకు సంబంధించి వందలాది మందిపై ఉన్న 38 కేసులను యోగి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వీరిలో బిజెపికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎటువంటి ఆందోళలను, అసమ్మతిని సహించలేని ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం..తనపై ఉన్న వ్యతిరేకతను అణచివేసేందుకు పోలీసులను విస్తృతంగా ఉపయోగిస్తోంది. వివాదాస్పద పౌరసత్వ చట్టం సిఎఎకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై కూడా క్రూరంగా వ్యవహరించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 20 మంది ఆందోళనకారులు మరణించారు.
ముస్లిములకు చెందిన దుకాణాలు, ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని పోలీసులు భారీగా పలు రకాల జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, హిందూత్వ పాలనను అమలు చేసే వారికి మధ్య ఉన్న వ్యత్యాసం మసకబారింది. కుల, మతతత్వ స్వార్ధ ప్రయోజనాలను పరిరక్షించేందుకు పోలీసు, పాలనా యంత్రాంగం ఎంతకైనా బరితెగిస్తుందనేది హథ్రాస్‌ దారుణం వెల్లడించింది. ఇటువంటి దారుణమైన యోగి పాలనలో పేదలు అణచివేతకు గురైనప్పటికీ వారికి సాయం లేదు. హిందూత్వ రాజ్యం ఉనికి లోకి వస్తే ఎలా ఉంటున్నదానికి...ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న ఇటువంటి అనాగకరిక చర్యలు...మిగతా భారతదేశానికి హెచ్చరికలు వంటివి.
('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం క్లుప్తంగా)