- 5వేల రూపాయలను ప్రోత్సాహక నగదుగా అందజేత
- మదనపల్లి డి.ఎస్.పి కె.కేశప్ప
ప్రజాశక్తి-నిమ్మనపల్లి : రోడ్డు ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన డ్రైవర్ ఎం.వెంకటరమణను మదనపల్లి డిఎస్పి కే.కేశప్ప ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ మార్చి 1వ తేదీ న రాచవేటివారి పల్లి వద్ద ద్విచక్ర వాహనం, మహేంద్ర లగేజీ వాహనం ఢీకొనడం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో రాచవేటివారి పల్లెకు చెందిన కె.సురేంద్ర రెడ్డి(65) తీవ్రంగా గాయపడ్డాడు. తలకి తీవ్ర గాయం పాటు, ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయన్నారు. మదనపల్లికు చెందిన డ్రైవర్ ఎం.వెంకటరమణ సకాలంలో స్పందించి 108 వాహనానికి ఫోన్ చేయగా, వాహనం అందుబాటులో లేదని తెలియటంతో, డ్రైవర్ తన వాహనాన్ని సంఘటనా స్థలంలోనే వదిలి, ప్రైవేటు వాహనంలో గాయపడ్డ వ్యక్తిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. సకాలంలో వైద్యులు చికిత్సలు అందించడంతో గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. మానవత్వంతో స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన మదనపల్లెకు చెందిన డ్రైవర్ ఎం.వెంకటరమణ ను డిఎస్పి స్థానిక పోలీస్ స్టేషన్ నందు దుశాలవతో ఘనంగా సన్మానించి, 5000/- రూపాయలను ప్రోత్సాహక నగదుగా అందించారు. రోడ్డు ప్రమాద సమయాల్లో గాయపడ్డ వ్యక్తులపై మానవత్వంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఫాతిమా, నిమ్మనపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










