- కోవిడ్ పేరుతో సికింద్రాబాద్- తిరుపతి మధ్య 16 ప్యాసింజర్ రైళ్లు రద్దు
- కరోనా తగ్గుముఖం పట్టినా పునరుద్ధరించని వైనం
- సామాన్యులు రైలు ఎక్కలేని దుస్థితి
- ఆదాయమే పరమావధిగా 'రైల్వేశాఖ'
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : అతి తక్కువ సమయంలోనే దూర ప్రాంతాలకు చేరుకోడానికి భారతీయ రైల్వే సికింద్రాబాద్- తిరుపతి మధ్య 'వందేభారత్' రైలును తీసుకొచ్చింది. ఈ రైలును ప్రధానమంత్రి మోడీ స్వయంగా సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. వందే భారత్ రైలు సికింద్రాబాద్- తిరుపతి మధ్య ఎనిమిదిన్నర గంటల్లో వాయువేగంతో ప్రయాణిస్తుందని, సరసమైన ధరలతో ప్రయాణికులకు ఆహ్లాదకరమైన సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చామని మోడీ ప్రకటించారు. అయితే నిరుపేదలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్ల రద్దు పరిస్థితేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ జనరల్ బోగీలను తగ్గించి సామాన్యులు రైలుఎక్కే పరిస్థితి లేకుండా చేశారు. తిరుపతి నుంచి నలుమూలలకు ప్రయాణించే 16 ప్యాసింజర్ రైళ్లను కోవిడ్ బూచి పేరుతో రద్దు చేసేశారు. రైతులకు, చిరువ్యాపారులకు, చిరు ఉద్యోగులకు, కూలీలకు అందుబాటులో లేకుండా చేశారు. దీన్నిబట్టి కేంద్ర రైల్వేశాఖ ఆదాయమే పరమావధిగా పనిచేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు 2021కి ముందు వరకు 16 ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. తిరుపతి - గుంతకల్ (2), తిరుపతి - కాట్పాడి (4), తిరుపతి - హుబ్లీ (2), తిరుపతి - గూడూరు (3), తిరుపతి - మచిలీపట్నం (1), తిరుపతి - పాండిచ్చేరి (1), తిరుపతి - మద్రాస్ (2), తిరుపతి - ధర్మవరం (1) ప్యాసింజర్ రైళ్లు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. కోవిడ్ కారణంగా కొన్ని నెలల పాటు ఏ రైలూ పట్టాలెక్కలేదు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత కేవలం ఎక్స్‌ప్రెస్‌లను మాత్రమే పునరుద్ధరించారు. ప్యాసింజర్ రైళ్లను స్పెషల్ ట్రైన్‌లుగా మార్చేశారు. గతంలో సంక్రాంతి, దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ ట్రైన్‌లను నడిపేవారు. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లలో 40 శాతం ఛార్జీలను పెంచి ఏడాదంతా 'స్పెషల్' పేరుతో నడుపుతున్నారు. ప్యాసింజర్ రైలు అంటే పేదల బండి. ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు చెల్లించలేనివారు ప్యాసింజర్ రైళ్లనే ఎక్కువగా ఆశ్రయించేవారు. తిరుపతి నుంచి గూడూరుకు ప్యాసింజర్ రైలులో రూ.35 ఛార్జీ ఉండేది. దాన్నే రూ.90 చేశారు. తిరుపతి నుంచి చిత్తూరుకు రూ.25 ఛార్జీ ఉంటే ప్రస్తుతం రూ.60కి పెంచారు.
- ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలి
కోవిడ్ సమయంలో రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి. ఛార్జీలను పెంచి రైలుబండిని పేదలకు దూరం చేశారు. వందేభారత్ రైల్లో వేలకు వేలు ఛార్జీలు వసూలు చేస్తూ డబ్బున్నవారికి అందుబాటులోకి తెచ్చారు. నారాయణాద్రి రూట్‌లో నడుస్తున్న వందేభారత్ రైల్లో నాలుగు స్టాపింగ్‌లే ఉన్నాయి. అదే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ 14 స్టాపింగ్‌లలో నిలుపుతూ ఆయా ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ప్యాసింజర్ రైళ్లు ఉద్యోగులకు, చిరువ్యాపారులకు, వలస కూలీలకు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు లేకపోవడంతో వారికి 'స్పెషల్ ఎక్స్‌ప్రెస్'లలో ప్రయాణం భారంగా మారింది.
- సుదర్శన్‌రాజు, రైల్వే మజ్దూర్ సంఫ్‌ు గౌరవాధ్యక్షులు, గుంతకల్










