Apr 20,2023 06:59
  • 804.70 అడుగులకు
  • పడిపోయిన నీటిమట్టం
  • ఆందోళనలో రెండు రాష్ట్రాల రైతులు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి చేరుకుంది. విద్యుదుత్పత్తి పేరుతో అటు తెలంగాణ, ఇటు ఎపి ప్రభుత్వాలు ఇష్టానుసారంగా నీటిని తోడేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. పదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కీలకమైన సమయంలో సాగు నీరందక ఇరు రాష్ట్రాల రైతులూ ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 804.70 అడుగులు మాత్రమే ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు. ప్రస్తుతం 31.39 టిఎంసిలే ఉన్నాయి. ఏటా ఈ ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులు, నీటి నిల్వ 53 టిఎంసిలు మెయింటెన్‌ చేయాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. కానీ, రాష్ట్ర విభజన సమయం నాటి నుంచి ఏ యేడాదీ ఈ సీజన్లో 854 అడుగుల నీటిమట్టం లేదు. ఏటా 600 టిఎంసిల నుంచి 2 వేల టిఎంసిల వరకూ వరద నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. రాయలసీమ ప్రాంత పరిధిలో కృష్ణా నది వెంట ఎక్కడా రిజర్వాయర్లు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. శ్రీశైలం డ్యామ్‌ నీటి నిలువ డెడ్‌ స్టోరేజీకి పడిపోతే జీవరాశులకు నీటి లభ్యత తగ్గిపోతుంది. దీంతోపాటు వాతావరణం వేడెక్కి పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

  • సీమ ప్రాజెక్టులపై ప్రభావం

శ్రీశైలం జలాశయంపై ఆధారపడి రాయలసీమ లోని గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా, కెసి కెనాల్‌, ఎస్‌ఆర్‌బిసి కింద లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ముచ్చుమర్రి నుండి నీటిని నిలిపివేశారు. సుంకేసుల బ్యారేజీ నుంచి నీటిని అందిస్తున్నారు. రైతులకు సాగు అందించేందుకు 1.20 టిఎంసిలు, కర్నూలు ప్రజల దాహార్తి తీర్చేందుకు ఒక టిఎంసి నీటిని సుంకేసులలో నిల్వ చేశారు. ఎగువ నుంచి ప్రతి రోజూ 1200 క్యూసెక్కుల నీరు సుంకేసుల నుంచి వస్తుండగా కెసి కాలువ నీరు రబీలో పంటలకు అందిస్తున్నారు. ఈ నీరు సుంకేసుల నుంచి 140 కిలోమీటర్లు బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వరకు ప్రవహిస్తోంది. ఈ ఏడాది కెసి కాలువ కింద పంటలు దెబ్బతిన్న రైతులు శ్రీశైలం, తుంగభద్ర జలాల వినియోగంతో రెండో పంట ద్వారా గట్టెక్కవచ్చని భావించారు. ఈ నెల పదో తేదీ నుంచి సాగు నీటి విడుదల నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.