Oct 01,2023 17:34

ప్రజాశక్తి - విజయవాడ : ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా రక్షణకు మరో చారిత్రాత్మక పోరాటం నిర్వహించాల్సిన సమయం వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఎమర్జెన్సీ కాలంలో నాయకులను జైళ్లలో పెట్టినప్పుడు, 1984లో ఎన్‌టిఆర్‌ను అప్రజాస్వామికంగా పదవీచితుడిని చేసినప్పుడు...ఇలా అనేక సందర్భాల్లో చారిత్రాత్మక ఉద్యమాలు ఉద్భవించాయని గుర్తుచేశారు. సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా విస్తృత సమావేశం ఆదివారం నగరంలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు హరించివేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలపై దాడులు, నిర్బంధాలు పెరిగిపోయాయని చెప్పారు. ఇందుకు పాలకులు నిఘా వ్యవస్థలను సైతం వినియోగించుకుంటున్నారని అన్నారు. హిట్లర్‌ కూడా తన నిఘా వ్యవస్థ ద్వారా మారణహౌమం సృష్టించాడని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాసామ్య హక్కులను, ప్రజా ఉద్యమాలను రక్షించుకునేందుకు నవంబరు 7వ తేదీన 'ప్రజా రక్షణ భేరి' ద్వారా మరో చారిత్రాత్మక ఉద్యమానికి సిపిఎం సన్నద్ధమైందన్నారు. రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి చేస్తోందన్నారు. దీనికి ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వంపై కేంద్రం పెత్తనమే నిదర్శనమన్నారు. ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ఇడి, సిబిఐ, ఐటి దాడుల ద్వారా విపక్ష నేతలను భయపెట్టడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో విస్తరరణకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. పదేళ్ల క్రితం పార్లమెంట్‌కు వచ్చిన మహిళా బిల్లును సమర్థించని బిజెపి...ఇప్పుడు దానిని ఆమోదించి తన గొప్పగా చెప్పుకుని లబ్ధిపొందాలని చూస్తోందన్నారు. కానీ మహిళా చట్టాన్ని మాత్రం వెంటనే అమలు చేస్తామని చెప్పలేకపోతోందన్నారు. దీంతో ఈ చట్టం ఎప్పుడు అమలులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. జాతీయ ఉద్యమాన్ని రెచ్చగొట్టడం ద్వారానూ ప్రజలను ముఖ్యంగా యువత ఆలోచనను మూఢనమ్మకాల వైపు మళ్లిస్తోందన్నారు. మూఢనమ్మకాలను, శాస్త్ర విజ్ఞానాన్ని మిళితం చేస్తోందన్నారు. మణిపూర్‌ ఘటనలు, రెజ్లర్ల ఆందోళనలపై నోరుమెదపని ప్రధాని మోడీ....సనాతన ధర్మంపై ఉదయ నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఆగమేఘాల మీదు విరుచుకుపడ్డారని అన్నారు. వివక్ష, అణచివేతకు ప్రతిరూపమే సనాతన ధర్మమన్నారు. కానీ బిజెపి సనాతన ధర్మం పేరుతో వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు మతాల మధ్య చిచ్చు రేపుతోందని విమర్శించారు. ప్రజాస్వామిక చట్టాలను ఉల్లంఘిస్తోందన్నారు. 'ఇండియా' కూటమిని చూసి ఓటిమోత మోగుతున్న చెబుతున్న బిజెపి..చివరకు దేశం పేరునే మార్చడానికి సిద్ధమైందన్నారు. విద్యుత్‌ సంస్కరణల అమలుకు రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోందన్నారు. కేంద్రం వత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేక రూపాల్లో విద్యుత్‌ భారాలు మోపుతోందని విమర్శించారు. స్కిల్‌ స్కాం కేసులో బిజెపి సహకారం లేకుండా టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసే పరిస్థితిలేదన్నారు. ఈ స్కాంపై ముందుగా ఉప్పందించిన బిజెపి...ఆ తర్వాత తమకు సంబంధంలేనట్లుగా నటిస్తోందన్నారు. 2021లోనే నమోదైన ఈ కేసులో అధికారులను అరెస్టు చేసి విచారించినప్పుడే చంద్రబాబు తప్పని నోరు మెదిపి ఉంటే ఇప్పుడు పరిస్థితి తనదాకా వచ్చేదికాదన్నారు. అవినీతి జరగలేదని, తన పాత్రలేదని చంద్రబాబు కోర్టుల ద్వారా నిరూపించుకోవాలని అన్నారు. కానీ ఆయనను అరెస్టు చేసి తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు.

  • నవంబరు 7న బహిరంగ సభకు జనసమీకరణ

ఈ సమావేశంలో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ మాట్లాడుతూ నవంబరు 7వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి బహిరంగ సభకు జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకు ముందుగా అక్టోబర్‌ 28 నుండి 31వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ఏడు జాతాలు నిర్వహించాలన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఇందుకు పూర్తిస్థాయిలో కేంద్రీకరణ జరగాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీదేవి, పివి.ఆంజనేయులు, ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌, బోయి సత్యబాబు, కోట కళ్యాణ్‌, ఎం.నాగేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.