ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : నిత్యం దుర్భిక్షానికి నిలయమైన జిల్లాలో ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయి. రికార్డు స్థాయిలో వర్షాలు పడటంతో చెరువులు, కుంటలే కాకుండా ప్రధాన జలాశయాలు నీటితో నిండి జలకళను సంతరించుకున్నాయి. ప్రకృతి పరంగా బాగా అనుకూలమైన సంవత్సరమే అయినప్పటికీ రైతాంగానికి పెద్దగా ఫలసాయం దక్కలేదు. అధిక వర్షాలే రైతుకు నష్టాలను మిగిల్చాయి. మరోవైపు కోవిడ్ సమయంలో ఎగుమతుల్లేక ఉద్యానవన పంటలకు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడటం ఒకవైపు ఆనందాన్ని కలిగిస్తే, ధరల్లేక, దిగుబడి లేకపోవడం రైతుకు శాపంగా మారింది.
అధిక వర్షాలతో జలకళ
ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షాలు పడ్డాయి. సాధారణంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 493.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది. అయితే పడిన వర్షపాతం 747.5 మిల్లీమీటర్లు. అంటే సాధారణంగా పడాల్సిన దానికంటే 50 శాతానికిపైగా వర్షాలు పడ్డాయి. 60 ఏళ్లలో ఇదే రికార్డు వర్షపాతంగా చెప్పవచ్చు. దీంతో అనేక చెరువుల్లోకి కుంటల్లోకి నీరొచ్చి చేరింది. దీంతోపాటు తుంగభద్ర డ్యామ్‌లోనూ వర్షాలు అధికంగా పడటంతో సాగునీరు ఈ ఏడాది తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా 28 టిఎంసిల వరకు వచ్చే అవకాశముంది. ఇక హంద్రీనీవా ద్వారానూ 30 టిఎంసిల వరకు నీరొచ్చే అవకాశముంది. వచ్చే ఏడాది మార్చి వరకు నీరు హంద్రీనీవా ద్వారా రానున్నాయి. ఈ వస్తున్న నీళ్లతోనూ, వర్షపు నీళ్లతో ప్రధాన జలాశయాలు కళకళలాడుతున్నాయి. మూడు దశాబ్ధాల తరువాత మిడ్‌పెన్నార్ డ్యామ్ పూర్తి సామర్థ్యంతో నిండింది. చాగళ్లు, చిత్రావతి, యోగివేమన రిజర్వాయర్లు సైతం ఈ ఏడాది నీటితో నిండాయి. పిఎబిఆర్ కూడా ఐదున్నర టిఎంసిల వరకు తొలిసారి అధికంగా నీటిని నిలువ చేశారు. చెరువులను సైతం నీళ్లతో నిండిఉన్నాయి. భూగర్బ జలాలు సైతం పెరిగాయి.
రైతుకు నష్టాలే మిగులు
మార్చి నెలలో కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కావడంతో ఆ సమయంలో వచ్చే ఉద్యానవన పంటలైన చీనీ, బత్తాయి, కర్బూజ, అరటి పంటల ధరలు అమాంతంగా పడిపోయాయి. కొనేవారు లేక రైతులు పంటలను తొలగించేసుకున్నారు. కోట్లాది రూపాయలను రైతులు నష్టపోయారు. ఆ తరువాత వర్షాలు బాగా రావడంతో 11 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశారు. ఈ పంట ఏపుగా రావడంతో వేరుశనగ దిగుబడి బాగా వస్తుందని ఆశించారు. అయితే తీరా దిగుబడి చూస్తే నామ మాత్రంగా వచ్చింది. సుమారు వెయ్యి కోట్లకుపైగా రైతులు దిగుబడి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. తాజాగా టమోట ధరలు విపరీతంగా పడిపోయాయి. రూపాయితో కూడా కొనేందుకు ముందుకు రాకపోవడంతో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉద్యానవన పంటలను ఎగుమతి చేయడానికి కిసాన్ రైళ్‌ను ప్రారంభించింది. అయితే రైతుకు దీని వలన పెద్దగా ప్రయోజనం చేకూరిన దాఖలాల్లేవు. నివర్ తుపాను వల్ల మరో రూ.18 కోట్ల వరకు రైతులు పంటను నష్టపోయారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న వేరుశనగ రైతుకు బీమా ద్వారా కూడా సాయం అందే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుకు సాయం అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఈ ఏడాదిలో ప్రారంభించింది. అయితే ప్రకటించిన గొప్పగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు ప్రయోజనం చేకూరడం లేదన్నది ఆచరణలో స్పష్టమవుతోంది. పంట దిగుబడులు అక్కడే అమ్ముకోవచ్చుని చెబుతున్నా ఆచరణలో వీటి ద్వారా పంట కొనుగోలు మొక్కుబడిగానే సాగింది. వ్యాపారులపైనే రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ ఏడాది కూడా రైతులకు నష్టాలు తప్పా లాభాలు కన్పించలేదు.










