Oct 17,2023 08:23
  • యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం విజయవాడలో జరిగిన కమిటీ సమావేశానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం కరువుపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో సకాలంలో సరైన వర్షాలు పడక 300 మండలాలకు పైగా కరువు పరిస్థితులు ఉన్నాయని, పైకి పచ్చగా కనిపించినా సకాలంలో సరిపోయినంత వర్షపాతం లేనందున 30 లక్షల ఎకరాలకు పైగా పంటలు వేయలేదని పేర్కొంది. వేసిన పంటలు కూడా వర్షాలు లేక గిడసబారిపోవడమో, మాడిపోవడమో జరిగిందని, కర్నూలు జిల్లాలో పత్తి, అనంతపురం జిల్లాలో వేరుశనగ దెబ్బతిన్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. కొన్నిచోట్ల మొక్కజొన్న రెండోసారి వేయాల్సి వచ్చిందని, తాగునీటికి కటకట ఏర్పడిందనీ పేర్కొంది. కృష్ణా డెల్టాలో నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, విద్యుత్‌ కోతతో బోర్లకింద పంటలు ఎండిపోతున్నాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో వారం రోజులు వర్షాలు పడకపోతే తీవ్ర వర్షాభావ పరిస్థితులు వస్తాయని, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాల్లో వర్షాలు, ప్రాజెక్టుల్లో నీళ్లులేవని, వెంటనే కరువు మండలాలు ప్రకటించి ఎదుర్కోవడానికి తగిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కరువు పనులను అదనంగా ప్రకటించాలని, ఆయా ప్రాంతాల్లో ఇ-క్రాప్‌ బుకింగ్‌ వెంటనే చేయాలని, ఉపాధిహామీ పనులను మరో వందరోజులు పెంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. టెక్నికల్‌ సమస్యలున్నవనే పేరుతో పంటల నమోదు ఇ-క్రాపింగ్‌లు సరిగ్గా జరగడం లేదని, ఇంతవరకు కరువు ప్రాంతాల్లో 20 శాతం మాత్రమే నమోదు అయిందని తీర్మానంలో తెలిపారు. రైతులకు రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా వంటి ఇతర బెనిఫిట్స్‌ ఇ-క్రాపింగ్‌ నమోదు చేయకపోతే రావని, ఈ కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం శ్రద్ధతో ఇ-క్రాపింగ్‌ చేయాలని సిపిఎం కోరింది. ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితులను సమీక్షించి, కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని, వ్యవసాయ పంట రుణాలను రీషెడ్యూలు చేసి వడ్డీలు రద్దు చేయాలని, యుద్ధప్రాతిపదికపై కరువు నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. కేంద్ర ప్రభుత్వం కరువు పరిశీలనా బృందాలను పంపి సహాయం ప్రకటించాలని డిమాండ్‌ చేసింది.