Nov 20,2020 06:49

ప్రేమకు మతం రంగు పులమడం, ఆ అంశాన్ని రచ్చకెక్కించి ప్రయోజనం పొందాలని చూడడం కొందరికి అలవాటుగా మారిపోయింది. ఇటీవల హర్యానాలో నికితా తోమర్‌ ను...సహ విద్యార్థి తౌసిఫ్‌ కాల్చి చంపాడు. తనతో పెళ్లికి నిరాకరించినందుకే ఆమెను కాల్చి చంపానని పోలీసుల విచారణలో చెప్పాడు. 23 సెకన్ల స్వల్ప కాలవ్యవధిలో నికిత హత్యకు గురైంది. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సి.సి టి.వి ఫుటేజీలో స్పష్టంగా కనబడుతున్నాయి. నేరం జరిగి పది రోజులైనా నిందితులకు శిక్షపడలేదు. ఈ విషయాన్ని పక్కన బెట్టి ఈ ఘటనకు రాజకీయ, మత రంగులు పులమాలని కొన్ని కరడుగట్టిన, ప్రమాదకర శక్తులు నడుం బిగించాయి.


నికితా తోమర్‌ రాజ్‌పుత్‌ యువతి. తౌసిఫ్‌ ముస్లిం యువకుడు. తౌసిఫ్‌ కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. నికిత, తౌసిఫ్‌ చిన్ననాటి నుంచి స్నేహితులు. యుక్తవయస్సు వచ్చేసరికి ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసిందే. పెద్దల ఒత్తిడి తోనో, స్నేహితునిపై అపనమ్మకం తోనో నికిత అతనితో పెళ్లికి నిరాకరించింది. రెండేళ్ల నుంచి వారిరువురికీ మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. 2018 ఆగస్టు 2న తౌసిఫ్‌పై కిడ్నాప్‌ కేసు కూడా నమోదైంది. ఆ తరువాత తౌసిఫ్‌ కుటుంబం రాజకీయ పలుకుబడితో తోమర్‌ కుటుంబంపై ఒత్తిడి తేవడంతో నికిత ఆ కేసును ఉపసంహరించుకుంది. ఆ తరువాత నుంచి నికిత ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది ఆ కుటుంబం. అయినా వారి గారాలపట్టి అతి చిన్న వయసులోనే స్నేహితుని చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆ తల్లిదండ్రులకు తీరని బాధ. ఎవరూ తీర్చలేని వ్యధ. ఈ సందర్భంలో ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన ప్రముఖులు మతం ముసుగులో వారిని చీకటికోణం లోకి నెట్టి వేసే ప్రయత్నం చేస్తున్నారు.


'ముస్లిం యువకుడు హిందూ యువతిని కాల్చి చంపాడు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోమన్న ప్రతిపాదనను ఆమె తిరస్కరించడమే ఆ యువతి చేసిన నేరం. ఈ దేశంలో ఇటువంటి ఘటనలు నిత్యం పెరిగిపోతున్నాయి. ఈ 'లవ్‌ జిహాద్‌'ను వ్యతిరేకించడమే దేశభక్తులుగా మన కర్తవ్యం' వంటి విద్వేషపూరిత వ్యాఖ్యలతో ఊగిపోతున్నారు కొందరు. ఘటన జరిగిన మరుసటి రోజునే బాధిత యువతి ఇంటి ముందు 'కర్ణిసేన' వంటి పలు మతోన్మాద సంస్థలు 'లవ్‌ జిహాద్‌' గురించి మాట్లాడడం మొదలు పెట్టాయి. కొన్ని రోజుల నుంచి బాధితురాలికి న్యాయం జరగాలని ప్రదర్శనలు, సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడ అసలు సమస్య పక్కదారి పడుతోంది.
 

విద్వేష దాడులు
నవంబరు 1న 'సర్వ బిరదారి సంఘటన' ఆధ్వర్యంలో ఒక ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది అందులో పాల్గొన్నారు. ఒక్కసారిగా ఆ గుంపులో ఉన్న 200 మంది యువకులు హింసాత్మక దాడులకు తెగబడ్డారు. బిగ్గరగా అరుస్తూ, దుకాణాల మీద, పోలీసుల మీద రాళ్లురువ్వుతూ 44వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధం చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అక్కడ జరిగిన దాడిపై పలు వాట్సాప్‌ గ్రూపులు, ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలతో కూడిన సందేశాలు చేరాయన్న విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. నిందితునికి రాజకీయ పలుకుబడి ఉండడంతో ఈ ఘటన అత్యంత వేగంగా రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని స్థానిక పార్టీ నాయకురాలు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు...ఆ కుటుంబాన్ని బెదిరించేందుకు, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యుడు జైవీర్‌ ఖాట్నా ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాడు. ఆ పార్టీ కార్యకర్తలు తమపై దాడులకు తెగబడ్డారని మరో ఫిర్యాదు కూడా చేశాడు.
'ఇక్కడ మనం మహిళలపై జరుగుతున్న అత్యాచారం, హత్య, యాసిడ్‌ దాడులు వంటి దారుణ నేరాలకు పాల్పడడాన్ని ప్రధానంగా తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు సాధారణంగా బెదిరించడం, కొట్టడం వంటి ఘటనలతో ప్రారంభమవుతాయి. కాని యువతులు, వారి తల్లిదండ్రులు అటువంటి విషయాలను బయటకు చెప్పరు. అసలు వాటిని తీవ్రంగానే పరిగణించరు. తమ పరువు పోతుందని ఆ విషయాలను దాచివుంచేందుకు ప్రయత్నిస్తారు. చాలా కేసుల్లో 'మన లాంటి' సాంప్రదాయ కుటుంబాలు వీటిని వెలుగు లోకి తేవడమంటే నేరస్తుడి కంటే బాధితులకే ఎక్కువ నష్టమని భావిస్తారు.


ఇటువంటి ఉదాహరణలు దేశంలో చాలానే ఉన్నాయి. అక్కడి తల్లిదండ్రుల్లో చాలామంది తమ ఆడపిల్లలను దూరప్రాంతంలో ఉన్న స్కూళ్లకు పంపించరు. ఒకవేళ ఎవరైనా పంపినా ఆ పిల్లను దారిలో ఎవరైనా బెదిరిస్తే ఇక అంతేసంగతులు. ఆ పిల్ల చదువుకు స్వస్తి చెప్పాల్సిందే. ఇంట్లోనే ఒక మూల కూర్చోబెడతారు. బెదిరింపులు, దాడులు మతాలను బట్టి ఉండవు. ఈ ఘటనలను మతం కోణంలో చూడడం హీనమైన చర్య. అసలు ఎవరి మీదనైనా బెదిరింపు, దాడి కేసు నమోదైతే పోలీసులు వాటిని సీరియస్‌గా తీసుకోరు. అక్కడే అసలు నేరం మొదలవుతోంది. పోలీసుల పట్టనితనం నేరస్తులకు ఊతమిస్తోంది. పదేపదే దాడులు జరగడానికి అదే కారణం అంటున్నారు 'ప్రణబ్‌ ముఖర్జీ ఫౌండేషన్‌' సలహాదారు జగ్లన్‌.


నికిత తండ్రి కూడా ఇది మత సంబంధమైన అంశం కాదని అంటున్నాడు. 'నా కూతురు అతనిని వివాహం చేసుకోనన్నందుకే హత్యకు గురైంది. ఈ ఘటన మా ప్రాంతంలోని ఆడపిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అప్పటి నుంచి మా ప్రాంతం నుంచి ఏ ఒక్క అమ్మాయి కూడా ఉన్నత చదువులకు వెళ్లలేదు. ఏదో ఒకరోజు మాకు జరిగినట్లుగానే వాళ్లకూ జరుగుతుందని ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆడపిల్లలపై దాడులు చేయాలంటే భయపడేలా చట్టం తేవాలి. ఈ కేసులో చాలా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. అయినప్పటికీ వారికి ఇంతవరకు శిక్ష పడలేదు.' తోమర్‌ ఉద్వేగంగా అంటున్నాడు.
                                                                                                   (ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌)