దేశంలో కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా...ఈ వ్యాధి ప్రమాదం సమీప భవిష్యత్తు లోనే పొంచి వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా దరిదాపుగా ప్రపంచ దేశాలన్నింటికీ సోకింది. మన దేశంలో కరోనా వ్యాధి మార్చి 30వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించి, డిసెంబర్ 19వ తేదీ నాటికి కోటి మందికి సోకింది. లక్షా 45 వేల మందిని తన పొట్టనబెట్టుకున్నది. కరోనా వ్యాధి వస్తే నయం చేసుకోవడానికి స్పష్టమైన మందులు లేకపోవడంతో నివారణే ఏకైక మార్గమని, అందులో వ్యాక్సినేషనే అత్యుత్తమ నివారణ మార్గమని ప్రపంచ ప్రజలందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈ వ్యాధి నుండి బయటపడవచ్చుననే ఆశతో వున్నారు. రష్యా 'స్పుత్నిక్' పేరుతో ఆ దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులో వుంచడంతోపాటు వివిధ దేశాలలో ఈ వ్యాక్సిన్ అమ్మకానికి సంబంధించిన ఒప్పందాలు కూడా చేసుకుంది. అదేవిధంగా అమెరికా లోని 'ఫైజర్' కంపెనీ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను ప్రపంచం లోనే మొదటిసారిగా అందుబాటు లోకి తెచ్చి ప్రపంచ దేశాలతో వ్యాక్సిన్ అమ్మక ఒప్పందాలను చేసుకుంటూ పోతోంది.
మన దేశంలో సిఎంఆర్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్, జైడస్, డా|| రెడ్డీస్ లాబొరేటరీస్ లాంటి కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు కూడా వ్యాక్సిన్ అందుబాటు లోకి తేవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటు లోకి తేవడానికి ఇప్పటికి దరిదాపుగా 200 కంపెనీలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఏ కంపెనీ కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో వున్నటువంటి ప్రయోగ దశలలో ముఖ్యమైన మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయలేదు. పైగా, తమ వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాలు ఈ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా మంజూరు చేశాయి. బ్రిటన్, అమెరికా, రష్యా లాంటి దేశాలలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది.
ఇటీవల కరోనా వ్యాక్సిన్‌పై విపరీతమైన ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. అవేమిటంటే అమెరికాకు చెందిన 'ఫైజర్' అనే బహుళజాతి కంపెనీ తను తయారు చేసిన వ్యాక్సిన్ కరోనాను 95 శాతం నియంత్రించగలదని ప్రకటించుకుంది. 'ఫైజర్' కంపెనీ ప్రకటించిన రెండో రోజే 92 శాతం కరోనాను నియంత్రించగలిగిన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా మీడియాకు సమాచారాన్ని విడుదల చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సమాచారం హేతుబద్ధంగా లేదని, నియంత్రించే శక్తిని విశదీకరించే విషయాల వివరణలు పొందుపరచలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు 'ఫైజర్' కంపెనీ వ్యాక్సిన్‌పై స్పందించిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ ఈ వ్యాక్సిన్‌ను -70 డిగ్రీల సెల్సియస్ దగ్గర భద్రపరచవలసిన అవసరం వుందని చెప్పారు. దీని నిర్వహణ మన దేశంలో కష్టసాధ్యంగా ఉంటుందని, ఆర్‌యన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్లన్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవని స్పందించారు. ప్రపంచ జనాభా 780 కోట్లు ఉంటే వ్యాక్సిన్ శీతలీకరణ సామర్థ్యం 300 కోట్ల జనాభాకు మించి లేదు. దీనివల్ల ఈ వ్యాక్సిన్ వచ్చినా అందరికీ అందుబాటు లోకి రావడానికి చాలా సమయం పడుతుంది.
'ఫైజర్' కంపెనీ మన దేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే వ్యాక్సిన్ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ అధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవల అపోలో హాస్పిటల్ కార్పొరేట్ యజమాన్యం 10 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చేందుకు వీలుగా తమ మౌలిక వసతులు సమకూర్చుకుంటున్నామని ప్రకటించింది. ఈ విధంగా వ్యాక్సిన్ తయారీ దశలోనే ఒక వ్యాపార దృక్పథం బట్టబయలు అవుతున్నది. ఇదంతా అమలు కావడానికి రెండు లేదా మూడు సంవత్సరాలు పట్టవచ్చని పలువురు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రేపు వ్యాక్సిన్ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా వుంటుందనేది ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ ఒక భాగమైతే ఈ వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం మరో ముఖ్యమైన అంశం. ప్రపంచ దేశాల్లో కానీ భారత్‌లో గాని కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రధానంగా నిమగమైనవన్నీ బహుళజాతి కంపెనీలే. రాబోయే కాలం కరోనా వ్యాధిదేనని గుర్తించిన ఈ కంపెనీలన్నీ గత ఆరు మాసాల నుండి భవిష్యత్తు లాభాల కోసం అర్రులు చాస్తున్నాయి. లాభాలే పరమావధిగా భావించే బహుళజాతి కంపెనీలు ఈ వ్యాక్సిన్ పేరుతో చేసే వ్యాపారం ప్రజలకు శాపంగా మారనున్నదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.
ఎందుకో తెలియాలంటే...కరోనా విజృంభణ జరిగిన మే తరువాత చోటుచేసుకున్న ఓ అంశాన్ని ప్రస్తావించుకుందాం. ఎబోలా వ్యాధి నివారణకు వాడిన ''గిల్లెడ్'' కంపెనీ ''రెమిడెసివిర్'' ఇంజక్షన్ కరోనా నివారణకు మందుగా అమెరికాకు చెందిన బహుజాతి కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేస్తూ విపరీతమైన ప్రకటనలు గుప్పించింది. తద్వారా ఈ మందుకు కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో అమ్మింది. ఈ మందు కోర్సు వాస్తవ ఖరీదు రూ.36 వేలు. కాని బ్లాకులో రూ.లక్ష వరకు అమ్మకం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ''సాలిడారిటీ ట్రయల్''లో ప్రకటించినంత నియంత్రణ ఈ మందుకు లేదని, కేవలం తాత్కాలిక ఉపశమనమే ఇచ్చేలా వుందని, దీన్ని మందుల ప్రోటోకాల్ జాబితా నుంచి తొలగించారు. కానీ బహుళజాతి కంపెనీలకు కొమ్ము కాసే అమెరికన్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఏ) ఈ మందును కరోనా నివారణా మందుగా అనుమతిస్తూ ప్రకటించింది. ఈ మందును మన దేశంలో విచ్చలవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు మాదిరిగా కార్పొరేట్ ఆసుపత్రులు ఉపయోగించాయి.
భారతదేశంలో కరోనా విజృంభణ జరుగుతున్న తరుణంలో దీని నివారణ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని రాష్ట్ర ప్రభుత్వాలపై వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ సడలింపులను అదునుగా తీసుకుని పూర్తిగా చేతులు ఎత్తేశాయి. ఒక వైపు కేసులు పెరిగి వ్యాధి సామాజిక వ్యాప్తి చెందిందని, రెండవ విడత కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా పూర్తిగా ప్రజల స్వీయ నియంత్రణకే వదిలేశారు. కరోనా పరీక్షలు విస్తృతపరిచే కొలదీ కేసుల తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తించినా అందరికీ పరీక్షలు చేయాలనే సూచనలను కూడా పక్కకు పెట్టారు. వ్యాక్సిన్ రావడం ఆలస్యం అవుతుందని తెలిసినా...ప్రభుత్వ పరంగా ప్రజలకు...మాస్కు ధారణ, చేతుల శుభ్రత, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు కూడా చెప్పడంలేదు. వాటిని ప్రజల విజ్ఞతకే వదిలేశారు. మరోవైపు విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో వచ్చే పరిణామాలకు తగ్గట్లు యంత్రాంగాన్ని వినియోగించడం లోనూ అనేక లోపాలు వెలుగు చూశాయి.
ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అయితే దీని ధర రూ.750 వుంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, తదుపరి పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా ముగించుకుని వచ్చిన వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే తమ అజమాయిషీలో అందరికీ ఉచితంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. దీనికి అనుగుణంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలను, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను అవసరమైతే ప్రైవేటు కంపెనీలను కూడా తమ ఆధీనం లోకి తీసుకుని...అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు పంపిణీ అయ్యే విధంగా కోల్డ్ చైన్‌ను, రవాణా ఏర్పాట్లను చేయాలి. అప్పుడే వ్యాక్సిన్ అందరికీ వీలైనంత తొందరగా అందుబాటు లోకి వస్తుంది. కానీ ప్రభుత్వ చర్యలు ఈ విధంగా లేవు. 'అందరికీ వ్యాక్సిన్' ప్రకటనలకే పరిమితమయ్యే విధంగా వున్నది. కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తించాలి. ఈ వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, నియంత్రణ, అజమాయిషీ అంతా ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల చెప్పుచేతల్లోనే వున్నది. ఈ వ్యాక్సిన్ రావడంతో కరోనా కట్టడికి ఎంతమేర ఉపయోగపడుతుందో తెలియదు గానీ, వ్యాక్సిన్ కార్పొరేట్ల కోసమని స్పష్టమవుతున్నది.
* టి. కామేశ్వరరావు (ప్రజారోగ్య వేదిక' రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)










