- తడిచిన పంటలు
- కూలిన చెట్లు
- రాలిన మామిడి కాయలు
- విద్యుత్తు సరఫరాకు అంతరాయం
- ఇద్దరు మృతి
ప్రజాశక్తి- యంత్రాంగం : తుపాను, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పాలకొల్లు, పెనుమంట్ర, మొగల్తూరు, పెనుగొండ, కాళ్ల, ఉండి, ఆకివీడు, తదితర ప్రాంతాల్లో కళ్లాల్లోని ధాన్యం తడిపోయింది. ఇద్దరు మృతి చెందారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో యర్రగుంటపల్లి నుంచి మేడిశెట్టివారిపాలెం వరకూ రోడ్డుకు ఇరువైపులా చెట్లు కూలిపోయాయి. మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. మామిడికాయలు నేలరాలాయి. కొయ్యలగూడెం మండలంలో పెనుగాలులకు పొగాకు బేరన్ల పైకప్పు రేకులు ఊడిపోయి దూరంగా పడ్డాయి. ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్జీనియా పొగాకు బేరన్లకు నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరం, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 30 నిమిషాలపాటు కుండపోత వర్షం కురిసింది. గోపాలపురం మండలం వేలచింతలపాడులో ఈదురు గాలులకు చెట్లు విరిగి విద్యుత్తు స్తంభాలపై పడ్డాయి. రాకపోకలకు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలుల ధాటికి లంక గ్రామాల్లో వందలాది ఎకరాల్లోని బొప్పాయి, అరటి తోటలు, కూరగాయ తోటలకు త్రీవ నష్టం వాటిల్లింది. తమలపాకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కళ్లాల్లో అరబెట్టిన పసుపు, జొన్న, మొక్కజొన్న నీట మునిగాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం సంభవించిన ఈదురుగాలులు, వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కందిపాడు వద్ద పొలంలో పిడుగుపడి గుడిపూడి సత్యనారాయణ (38) మృతి చెందాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి సమీపంలో వర్షానికి విద్యుత్తు ట్రాన్స్‌ఫారం నుండి నిప్పురవ్వలు పడడంతో దాదాపు 25 ఎకరాల్లో మొక్కజొన్న పంట, నూర్పుడి చేసి ఉంచిన మొక్కజొన్న దగ్ధమైంది. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి, తిమ్మాపురం, నందిపల్లి గ్రామాల్లో దాదాపు 50 ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది. రైతులకు దాదాపు రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో చల్లపల్లి మండలంతో పాటు పలుచోట్ల ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు లేచి ఎగిరిపోయాయి. విజయవాడ-నడకుదురు, చల్లపల్లి- వక్కలగడ్డ, వెలివోలు కరకట్ట రహదారులపై చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల తాకిడికి విజయవాడలోని ప్లెక్సీలు, సైన్ బోర్డులు, హోరింగ్‌లు, బ్యానర్లు చెల్లాచెదురయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు, అడ్డతీగల, చింతూరు మండలాల్లో వర్షం పడింది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరులో గోడ కూలి మీదపడటంతో భూపతి రాహుల్ అంబేద్కర్ (24) మృతి చెందాడు. దెబ్బతిన్న పంటలను ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి వేముల పల్లి వెంకట్రామయ్య పరిశీలించారు.










