May 16,2022 07:47
  • పొద్దుతిరుగుడు, పత్తి రైతులపై ఆర్థిక భారం
  • బ్లాక్‌ మార్కెట్లో కొనుక్కోవాల్సిన దుస్థితి

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులకు విత్తన కష్టాలు ప్రారంభయ్యాయి. ఒకవైపు కంపెనీలు విత్తన ధరలను పెంచాయి. మరోవైపు బ్లాక్‌ మార్కెట్‌ రైతు లను దోచేస్తోంది. ప్రసుత్తం నూనెల ధరలు ఆకాశాన్ని అంటుండడంతో రైతులు వేరుశనగతోపాటు, పొద్దు తిరుగుడు సాగువైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కంపెనీలు పొద్దుతిరుగుడు విత్తన ధరలను గతేడాది కంటే ఈ ఏడాది వంద శాతానికిపైగా పెంచేశాయి. ఈ ఏడాది పత్తికీ మంచి ధర ఉండడంతో కొన్ని కంపెనీల విత్తనాలను బ్లాక్‌లో రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. ఈ రెండు పంట రకాల విత్తనానికి డిమాండ్‌ ఉండడంతో బ్లాక్‌లో వ్యాపారం జోరుగా సాగుతోంది.
 

                                               గతేడాది 1,400... ఇప్పుడు రూ.3 వేలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో పొద్దు తిరుగుడు నూనె దిగుమతి తగ్గిపోవడంతో ధర పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులు పొద్దుతిరుగుడు పంట సాగుపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రధానంగా సుమిత్ర, గంగా కావేరి, అడ్వాన్ట్‌ అనే మూడు కంపెనీలే పొద్దుతిరుగుడు విత్తనాలను అమ్ముతున్నాయి. గంగా కావేరి, సుమిత్ర కంపెనీల రెండు కిలోల ప్యాకెట్‌ రూ.1200కు గత ఏడాది అమ్మారు. ఇప్పుడు రూ.2,400కు అమ్ముతున్నారు. అడ్వాన్ట్‌ కంపెనీ ధర గతేడాది రూ.1400 ఉండేది. ఇప్పుడు రూ.3 వేలకు అమ్ముతున్నారు. అయినా, బహిరంగ మార్కెట్‌లో లభించడం లేదు. బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోవడమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు 16 వేల ఎకరాలు. ఇందులో పది వేల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే సాగు చేస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో కర్నూలు జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో సాగవుతుంది. ప్యాకెట్‌పై ఉన్న ధర రూ.750... అమ్ముతున్నది రూ.1,600కు రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 15.82 లక్షల ఎకరాలు. అనంతపురం జిల్లాలో 1.30 లక్షల ఎక రాల్లో సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలు ఉన్న తాడిపత్రి, పెద్దవడుగూరు, పెద్దపప్పురు, గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో ఈ పంట అధికంగా సాగవుతుంది. ఇక్కడ తడాఖా, అఖిర రకాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ విత్తనం బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం లభించడం లేదు. అత్యధికంగా సాగయ్యే పెద్దవడుగూరు మండలంలో ఈ విత్తనాన్ని దుకాణదుకారులే బ్లాక్‌లో నేరుగా విక్రయిస్తున్నారు. కిలో రూ.750 విలువ చేసే ప్యాకెట్‌ను రూ.1600కు అమ్ముతున్నారు. అది కూడా బిల్లు లేకుండా మూడు రోజులు ముందుగానే డబ్బులు చెల్లించాలని షరతు పెడుతున్నారు. అంతేకాకుండా పంట దిగుబడి ఎలాగున్నా తమకు సంబంధం లేదని ముందుగానే తేల్చి చెబుతున్నారు. దిగుబడి బాగా వస్తుందని ఈ రకాన్నే కొనుగోలు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.
 

                        ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : చంద్రా నాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి

అధిక ధరకు అమ్ముతున్నట్లు రైతుల నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనా ఫిర్యాదు అందలేదు. రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి బ్లాక్‌లో అమ్మినట్టు తేలితే అటువంటి వారి లైసెన్సు రద్దు చేస్తాం. విత్తనాల నిల్వలు ఎంత ఉన్నాయన్న సమాచారం మా వద్దే ఉండదు. అవి కంపెనీలు నేరుగా అమ్మకాలు చేస్తాయి. త్వరలో వివరాలు సేకరిస్తాం.
 

                                        వారం రోజులైనా పొద్దుతిరుగుడు విత్తనం దొరకలేదు

పొద్దుతిరుగుడు పంటను సాగు చేసేందుకు పంట పొలాన్ని సిద్ధం చేశాము. అడ్వాన్ట్‌ కంపెనీ విత్తనం కోసం వారం రోజులుగా తిరుగుతున్నాం. అనంతపురంలోనూ అన్ని దుకాణాల్లో అడగాం. విత్తనం లేదని చెబుతున్నారు. ఇంకో వారం రోజులు సమయం పడుతుందంటున్నారు. విత్తనం దొరికితే మరోమారు దుక్కులు దున్నుకొని ఈ వర్షాలకు విత్తుకునేందుకు ఉపయోగంగా ఉండేది.
                                     -రామ్మోహన్‌, మంగళమడక గ్రామం, ముదిగుబ్బ మండలం, సత్యసాయి జిల్లా