Jan 02,2023 21:44

ఫొటో : కళాశాల వద్ద ధర్నా చేస్తున్న ఎస్‌.ఎఫ్‌.ఐ. నాయకులు

'విట్స్‌'లో విద్యార్థులకు ఫీజు ఇబ్బందులు
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో ఉన్న విట్స్‌ ఇంజనీర్‌ కాలేజీ యాజమాన్యం ఫీజుల విషయంలో విద్యార్థులను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఆరోపించారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ కావలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాలేజీ వద్ద విద్యార్థులు బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఫీజులు కడితేనే అప్లికేషన్‌ అప్లికేషన్‌ ఫారం రాయిస్తామంటూ కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం చాలా దారుణమన్నారు. పరీక్షల టైంలో రకరకాల ఫైన్‌లు పేరుతో విద్యార్థుల వద్ద నుండి వేల రూపాయలు వసూలు చేస్తూ, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.
హాస్టల్‌ విద్యార్థులను కూడా హాస్టల్‌ ఫీజు మొత్తం కడితేనే ఎగ్జామ్‌ రాయడానికి అనుమతి ఇస్తామంటూ చెప్పడం చాలా సిగ్గుచేటన్నారు. యాజమాన్యం ఒత్తిడితో విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారన్నారు. చదువుల మీద దృష్టి పెట్టలేక పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులపై ఒత్తిడిని ఆపాలన్నారు. అలా లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో డైఫీ కావలి పట్టణ కార్యదర్శి పి.పెంచల నరసింహం, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అజరు, సూర్య, నాయకులు రాకేష్‌, ఉదరు, అభి, సాయి, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.