- ఆగస్టు 2, 3 తేదీలలో ఢిల్లీలో మహా ధర్నా
విశాఖ స్టీల్ ప్లాంట్ 2004-05 ఒక్క సంవత్సరం లోనే రూ.2008 కోట్లు లాభాలు ఆర్జించింది. 2017-18 సంవత్సరంలో రూ.20 వేల కోట్ల టర్నోవర్‌కు పెరిగింది. ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టే విదేశీ కంపెనీలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కొనాలని వెంటపడుతున్నాయి. బిజెపి ప్రభుత్వం కారుచౌకగా అమ్మాలని కుట్ర చేస్తున్నది. అందుకే బిజెపి ప్రభుత్వ చర్యలను అడుగడుగునా అడ్డుకోవాలి.
ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను హోల్‌సేల్‌గా అమ్మాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సబ్‌కమిటీ (27.1.2021న) నిర్ణయించింది. పోస్కోకు 1172 ఎకరాల భూమిని గుట్టు చప్పుడు కాకుండా అమ్మాలని కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో చేసిన నిర్ణయాన్ని మార్చి నూరు శాతం అమ్మేయడానికి సిద్ధపడింది. నాటి నుంచి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. కమిటీ నాయకులు జులై 22 నుంచి 25 వరకూ పార్లమెంట్‌లో ఫ్లోర్ లీడర్లు, వివిధ పార్టీల జాతీయ నాయకులను కలిసి స్టీల్ పోరాటానికి మద్దతు కోరారు. వారి నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం జాతీయ సమస్యగా మారి ఇప్పటికే పార్లమెంట్‌లో లేవనెత్తారు. విశాఖ స్టీల్ సమస్యపై పార్లమెంట్ ప్రొసీడింగులనే అడ్డుకుంటామని కూడా కొంతమంది నాయకులు హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలనే మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. విశాఖ స్టీల్ నాయకులు జులై 24న ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. నాయకులు అడిగిన ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా దాటవేశారామె. రూ.2 లక్షల కోట్ల విలువ చేసే భూములను, మరో రూ. లక్ష కోట్ల విలువగల స్టీల్‌ప్లాంట్ యంత్రాలు, టౌన్‌షిప్, పవర్‌ప్లాంట్‌లు, రిజర్వాయర్లను ఎందుకు కారుచౌకగా అమ్ముతున్నారు? దేశంలోని అన్ని స్టీల్‌ప్లాంట్లకు సొంత గనులు వున్నాయి. వాటికి టన్ను ఇనుప ఖనిజం రూ.800కే లభిస్తుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ బయట మార్కెట్‌లో టన్ను రూ. ఐదున్నర వేలకు కొనాల్సి వస్తోంది. దేశంలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ ప్లాంట్లకు సొంత గనులు వున్నా...విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణ చేయడం కోసమే సొంత గనులు ఇవ్వలేదు. ఈ ఏకైక సమస్యను పరిష్కరిస్తే ప్లాంట్ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్టీల్ ప్లాంట్ నాయకులు కోరినా మంత్రి నుండి సమాధానం రాలేదు.
కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. న్యాయ సలహాదారుని, బదిలీ సలహాదారుల్ని నియమించడానికి బిడ్డింగ్ వేయడానికి జులై 29న ఆఖరు రోజుగా ప్రకటించారు. ఎవరూ కొటేషన్ వేయనందువల్ల ఆగష్టు 17కు వాయిదా పడింది. ఈ సలహాదారులు స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన గనులు, రైల్ ప్లాంట్ (రాయబరేలి) ప్రాంతాలన్నీ పర్యటించి విశాఖ స్టీల్ ప్లాంట్ విలువను నిర్ణయించే రిపోర్ట్ తయారు చేయాలి. ఏ లీగల్ కంపెనీలకు కొటేషన్ వేసే ధైర్యం లేకనే వాయిదా పడింది. అసలు పూర్తిగా కంపెనీని కొనడానికి ఎవరొస్తారనే ప్రధాన చర్చ సాగుతున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలొస్తున్నాయని సిక్ పరిశ్రమగా ప్రకటించాలని 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించింది. ఆనాడు కార్మిక సంఘాలు మాత్రమే దానికి వ్యతిరేకంగా పోరాడాయి. ఆ నిర్ణయాన్ని ఆపగలిగాయి. నాడు నష్టాల్లో ఉన్నా...సుమారు 5 వేల కోట్లు వడ్డీతో చెల్లించగా...2008-09 నాటికి రూ.6,000 కోట్లు అదనంగా లాభాలు మిగిలాయి. 2004-05 ఒక్క సంవత్సరం లోనే రూ.2008 కోట్లు లాభాలు ఆర్జించింది. 2017-18 సంవత్సరంలో రూ.20 వేల కోట్ల టర్నోవర్‌కు పెరిగింది. ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టే విదేశీ కంపెనీలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కొనాలని వెంటపడుతున్నాయి. బిజెపి ప్రభుత్వం కారుచౌకగా అమ్మాలని కుట్ర చేస్తున్నది. అందుకే బిజెపి ప్రభుత్వ చర్యలను అడుగడుగునా అడ్డుకోవాలి.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే గొప్ప ఐక్యత ఏర్పడింది. అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీలు, యావత్ కార్మిక సంఘాలు, రైతు, ఇతర ప్రజా సంఘాలు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రతిజ్ఞ పూనాయి. ఇంతటి ఐక్యత వుండగా ఏ కంపెనీ టెండర్లు వేయడానికి సాహసించదు. స్టీల్‌ప్లాంట్ 4 గోడల మధ్య 40 వేల మంది పని చేస్తున్నారు. వీరందరి మనోభావాలకు భిన్నంగా వారిపై నిర్బంధంగా పని చేయించడం అసాధ్యం! బిజెపి ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో కూడా 13 కంపెనీలను పూర్తిగా అమ్మివేయాలని...సేలం, దుర్గాపూర్ కంపెనీలతో పాటు విశాఖపట్నం లోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను కూడా అమ్మాలని ప్రయత్నించింది. అన్ని చోట్ల కార్మికవర్గం తిరుగుబాటు చేసింది. దాంతో బిజెపి ఎన్నికల ముందు తోక ముడిచింది. ప్రైవేటీకరించలేకపోయింది. మరలా అదే తంతును ఇప్పుడు కొనసాగిస్తోంది. కేంద్ర బిజెపి ప్రభుత్వం తమ తప్పుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బిజెపి నాయకులు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. వారు ఈ తప్పుడు ప్రకటనలు మానుకోవాలి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను బిజెపి రాష్ట్ర నాయకులు కూడా చిత్తశుద్ధితో వ్యతిరేకించాలి.
ఆగస్టు 2, 3 తేదీలలో ఢిల్లీలో జరిగే మహా ధర్నా విశాఖ స్టీల్ పోరాటంలో ఒక మలుపు. అవసరమైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామేగాని...మడమ తిప్పేది లేదని విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది.
/వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
సిహెచ్. నర్సింగరావు











