- ఆందోళనలో వినియోగదారులు
ప్రజాశక్తి - యంత్రాంగం : విద్యుత్ వినియోగదారులకు విద్యుత్‌శాఖ షాకుల మీద షాక్ ఇస్తోంది. డెవలప్‌మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు వస్తుండడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ సర్వీసు కనెక్షన్ (మీటరు) తీసుకునే సమయంలో సూచించిన కిలోవాట్ల కంటే అధికంగా విద్యుత్‌ను వినియోగించిన వారిపై ఓవర్‌లోడ్ ఛార్జీలు వేయడంతో వంద రూపాయల బిల్లు వచ్చే వారికి వేలల్లో బిల్లులు రావడంతో వినియోగదారులు కంగుతింటున్నారు.
అనంతపురం నగరంలోని సాయినగర్‌లో రెండు గదులున్న ఒక ఇంట్లో రాజ్‌కుళ్లాయప్ప ఉంటున్నాడు. ఆయనుంటున్న ఇంటికి అదనపు లోడ్ పేరుతో ఈ నెల అదనంగా రూ.1200 ఛార్జీ చెల్లించాలని విద్యుత్ శాఖ ఆన్‌లైన్‌లో బిల్లు జనరేట్ చేసింది. ఎప్పుడూ ఫోన్ పేలో బిల్లు చెల్లించే ఆయన ఈ నెల బిల్లు మొత్తం రూ.1400 వచ్చే సరికి అధికారులను సంప్రదించారు. రెగ్యులర్‌గా నెలకు రూ.80 మాత్రమే బిల్లు వచ్చేదని తెలపగా అదనపు లోడ్ వాడుతున్నారంటూ ఒక నోటీసును చేతిలో పెట్టారు. ఈ ఏడాది జనవరి 8న అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ తనిఖీ చేసిన సమయంలో అనుమతికి మించి విద్యుత్ వాడుతున్నట్టుగా గుర్తించినందున ఈ అదనపు రుసుం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అదే విధంగా రాజ్‌కుళ్లాయప్పకు ఉన్న కాంపౌండ్‌లో సింగిల్ రూములో ఉండే కుటుంబానికి 0.26 కిలోవాట్స్ పరిమితి ఉండగా 1.26 కిలోవాట్స్ వాడుతున్నారంటూ రూ.1500 అదనపు ఛార్జీ వేశారు. ఓవర్ లోడ్ పేరుతో అందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరు నెలల్లో అదనపు బిల్లులు వస్తుండడం గమనార్హం.
విశాఖ జిల్లా తగరపువలస మండలం సంగివలసకాలనీకి చెందిన అత్తిలి గంగాభవాని మార్చి నెలలో 161 యూనిట్లు వాడగా రూ.547 బిల్లు వచ్చింది. ఏప్రిల్ నెలలో చేతికి బిల్లు ఇవ్వలేదు. మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌లో 199 యూనిట్లు వాడినట్లు రావడంతో రూ.704 చెల్లించాం. మేలో 210 యూనిట్ల వాడకానికి రూ.993 బిల్లు వచ్చింది. ఇలా ప్రతినెలా రూ.200 పైగా బిల్లులో వ్యత్యాసం ఉంది. విద్యుత్ బిల్లులు ఈ విధంగా పెంచుకుంటూ పోతే మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతకాలని ఆమె ప్రశ్నిస్తోంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వృద్ధురాలు కోటమ్మకు ఏప్రిల్ నెల విద్యుత్ బిల్లు రూ.7,930 వచ్చింది. ప్రతి నెలా ఆమెకు రూ.60 మాత్రమే బిల్లు వచ్చేది. ఏప్రిల్ నెలలో 941 యూనిట్లు విద్యుత్ వినియోగించినట్లు బిల్లులో చూపించారు. దీనిపై లైన్‌మెన్‌ను కలవగా తానేమీ చేయలేనని చెప్పారు. ఇది సాంకేతిక సమస్య అని, దరఖాస్తు చేసుకుంటే తప్ప సరిచేయడానికి వీలుపడదని సచివాలయ ఉద్యోగులు కోటమ్మకు చెప్పడంతో ఆమెకు ఏం చేయాలో తెలియక వెనుదిరిగింది.
కడప, అన్నమయ్య జిల్లాల్లో 8,53,926 గృహ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి 1991 సర్వీసులకు అదనపు లోడు ఉన్నట్లు గుర్తించి రూ.70 లక్షల వరకు వసూలు చేశారు. అదనపు లోడుకు నగదు చెల్లించని వారి ఇంటికి సర్వీసు కట్ చేస్తున్నారు. కడప జిల్లా చాపాడు మండలంలోని సిద్దారెడ్డిపల్లెకు చెందిన టి.వీరారెడ్డి ఇంటికి ఏప్రిల్ నెలలో 140 యూనిట్లకు రూ.407 వచ్చింది. మే నెలలో అదే యూనిట్లకు రూ.574 బిల్లు వచ్చింది. కృష్ణాజిల్లా గన్నవరం ఉంటున్న కె.ప్రసాద్‌కు మార్చిలో రూ.2334 బిల్లు రాగా, ఏప్రిల్‌లో రూ.3930 వచ్చింది. అదనంగా రూ.1596 ఒక్కసారిగా పెరగడంతో అతను అయోమయానికి గురయ్యాడు. ఓవర్ లోడ్ పేరుతో రూ.3 వేలు అదనంగా వసూలు చేశారు. పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన డి.బాబూరావుకు ఫిబ్రవరిలో రూ.510, మార్చిలో రూ.1330, ఏప్రిల్‌లో రూ.1969 బిల్లు వచ్చింది. పెరిగిన ఈ బిల్లును చూసి ఆయన ఆయోమయానికి గురయ్యాడు.










