ప్రజాశక్తి-విజయవాడ: జిల్లాలో ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక అందించేలా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సిఎస్ కె.ఎస్. జవహర్‌రెడ్డికి వివరించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి ఆయన కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, విద్య, వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు, డా.వైఎస్సార్ కంటి వెలుగు, అమ్మఒడి, స్పందన ధరఖాస్తుల పరిష్కారం, పిహెచ్‌సిల నిర్మాణ పనులు తదితర అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్‌టిఆర్ జిల్లా నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జిల్లాలోని 951 పాఠశాలకు సంబంధించిన జగనన్న విద్యా కానుక కిట్లలో భాగమైనా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్సు, బెల్టు, శాతం యూనిఫారం, షఉస్, డిక్షనరీలను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్దం చేశామని వివరించారు. నాడు-నేడు పనులలో భాగంగా ఈనెల 12వ తేదిన పాఠశాలలు ప్రారంభించే నాటికి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. డా.వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అవ్వాతాతలకుజిల్లాలో 2 లక్షల 8 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యం కాగా ఇప్పటికే 99 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఇంకనూ నిర్వహించవలసిన కంటి పరీక్షలను వారానికి 10 వేలు పరీక్షలను లక్ష్యంగా నిర్థేశించుకుని సెప్టెంబర్ మాసంలోగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నామన్నారు. జిల్లాలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వత్సవాయి మండలంలోని భీమవరం , విజయవాడ రూరల్ మండలంలోని నున్న గ్రామాలలో స్థల సేకరణ సమస్య పరిష్కారం కాబడి, స్థలం కేటాయింపు జరిగిందని, త్వరితగతిన ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డిల్లీరావు ప్రధాన కార్యదర్శికి వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి డిఇవో సివి రేణుక, సమగ్ర శిక్ష అభియాన్ అడిషన్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జి. మహేశ్వరరావు, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, ఐసిడిఎస్ పిడి జి.ఉమాదేవి, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ జె. సుమన్, తదితర అధికారులు పాల్గొన్నారు.










