- రైతు నుండి రైతుకు చెల్లు
- రాయితీ విత్తనం ట్రేడర్ల నుండి సేకరణ
- నాణ్యతపై ఆందోళనలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వేరుశనగ విత్తనాల సేకరణ, పంపిణీలో 'రైతు నుండి రైతుకు' కాన్సెప్ట్ ఈ తడవ రివర్స్ అయింది. సబ్సిడీ విత్తనాలను నేరుగా రైతుల నుండి కాకుండా టెండర్లు పిలిచి ట్రేడర్ల నుండి సేకరిస్తున్నారు. రైతుల నుండి సేకరించినప్పుడే చాలా చోట్ల నాణ్యత లోపించినట్లు ఆరోపణలు రాగా, రైతుల నుండి సేకరించే పద్ధతికి స్వస్తి పలికి ట్రేడర్ల నుండి సేకరిస్తే మరింతగా నాసిరకం, కల్తీ విత్తనాలొచ్చే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టెండర్లు ఖరారు కావడంతో అనంతపురం, ఇతర రాయలసీమ జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద విత్తనాల శుద్ధి మొదలైంది. ఇదిలా ఉండగా వచ్చే ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనాల సేకరణను ప్రభుత్వం తగ్గించుకుంది. నిరుటి లక్ష్యం నాలుగున్నర లక్షల క్వింటాళ్లు కాగా ఈ ఏట టార్గెట్ మూడున్నర లక్షల క్వింటాళ్లకు కుదించారు. లక్ష క్వింటాళ్లను తగ్గించారు. ప్రతి రైతుకూ గతేడాది గరిష్టంగా 90 కిలోలు (30 కిలోల మూడు మూటలు) ఇవ్వగా, ఈ సారి 150 (ఐదు మూటలు) కిలోలివ్వాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఒక వైపు సేకరణను తగ్గించి మరోవైపు రైతులకు పంపిణీ చేసే పరిమాణాన్ని పెంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో ముందే నాన్-సబ్సిడీ అమౌంట్ చెల్లించి విత్తనాలను బుక్ చేసుకోవాలన్న నిబంధన వలన రైతులు ఆసక్తి చూపడం లేదని, వేరుశనగ సాగుపై రైతుల్లో అనాసక్తి ఉందని, ఈ కారణాలే సేకరణ తగ్గింపు, పంపిణీ పరిమాణం పెంపు వెనుక మతలబుగా చెబుతున్నారు.
అంతా ఎపి సీడ్స్‌కే
గత రెండు మూడేళ్లలో రాయితీ వేరుశనగ విత్తనాలను అనంతపురంలో మన విత్తన కేంద్రాలు, పల్లె జీవం ప్రోగ్రాముల కింద రైతుల నుండి సేకరించారు. సేకరణ బాధ్యత వ్యవసాయశాఖపై ఉండేది. ఎపి సీడ్స్ బాధ్యత సేకరించిన సీడ్‌కు లేబుల్ వేసి, ప్యాకింగ్ చేసి, మండల కేంద్రాలకు పంపడం. ఈ మారు సేకరణలో వ్యవసాయశాఖ పాత్ర లేదు. టెండర్ల ద్వారా సేకరణ మొదలుకొని ప్రాసెసింగ్, ప్యాకింగ్, రవాణ అంతా ఎపి సీడ్స్ పనే. నాణ్యతపై పరిశీలన, పంపిణీ బాధ్యత మాత్రమే వ్యవసాయశాఖకు అప్పగించారు.
అత్యధికం ట్రూత్‌ఫుల్
ట్రేడర్ల నుండి విత్తనాలను సేకరిస్తుండటంతో సర్టిఫైడ్ సీడ్ (సిఎల్) తక్కువ పరిమాణంలో ఉంటుందని, అత్యధికంగా ట్రూత్‌ఫుల్ (టిఎల్) వచ్చే అవకాశం ఉందని అంచనా. సర్టిఫైడ్ సీడ్ అంటే సాగు నుండి కోతల వరకు అంతా వ్యవసాయశాఖ పర్యవేక్షణలో జరుగుతుంది. అదే ట్రూత్‌ఫుల్ అయితే అలా ఉండదు. ట్రేడర్లు మార్కెట్‌లో విత్తనకాయలను కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ తడవ నాణ్యత సమస్య వస్తుందని చెబుతున్నారు. రబీ నుండి ప్రభుత్వం ప్రయత్నిస్తే రైతుల నుండి నేరుగా విత్తనాలు సేకరించొచ్చు. రబీలో రెండున్నర లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. ప్రభుత్వం 'రైతు నుండి రైతు వద్దకు' కాన్సెప్టును వదిలేసి టెండర్ల బాట పట్టడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం అయిందని విమర్శలొస్తున్నాయి. అటు విత్తన రైతుకు ధర సైతం రాలేదు.
సబ్సిడీ తగ్గింది
అన్ని ఖర్చులూ పోను విత్తనాల సేల్ ప్రైస్‌ను నిర్ణయించారు. క్వింటాల్‌పై గతేడాది కంటే రూ.200 తగ్గినప్పటికీ, రైతులకు సర్కారు ఇచ్చే రాయితీ రూ.105 తగ్గింది. సేల్ ప్రైస్ క్వింటాలు రూ.8,480 కాగా ప్రభుత్వ సబ్సిడీ రూ.3,367 (40 శాతం) రైతు చెల్లించాల్సింది రూ.5,117.











