పూజలు చేస్తున్న మేయర్
వైభవోపేతంగా వినాయక నిమర్జన ఘట్టం పూర్తి
ప్రజాశక్తి-నెల్లూరు:వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగరవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు సామూహిక నిమర్జన ఘట్టాన్ని స్థానిక ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గల గణేష్ ఘాట్ నందు శనివారం సాయంత్రం వేడుకగా పూర్తి చేశారు. వైభవోపేతంగా జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతిజయవర్ధన్ పాల్గొన్నారు. కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిమర్జన ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ల సహాయంతో వినాయక విగ్రహాలను చెరువులో నిమర్జనం చేసే ఘట్టాన్ని మేయర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. గణేష్ ఘాట్ కు భారీ సంఖ్యలో ఊరేగింపుగా వచ్చిన విగ్రహాలకు స్వాగతం పలికి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో నిమర్జనం చేశారు. నిమర్జన ఘట్టం అనంతరం పాల్గొన్న భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించి విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు అందరిపై కటాక్షించాలని మేయర్ ఆకాంక్షించారు.










