Jun 09,2023 15:50
  • సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనులకు తీర్మానం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పట్టణాభివృద్దే ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి అన్నారు. శుక్రవారం పురపాలక కార్యాలయంలోని సభా భవనంలో చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని పలు అభివృద్ధి పనులు పై చర్చించి తీర్మానం చేశారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద గల 48 బ్లాకులలో ఆక్రమణలు తొలగించి సుందరీకరణ గావించి డ్వాక్రా మహిళలకు రైతు బజారు, పార్కు ఏర్పాటు చేయడానికి తీర్మానం చేశారు. పాత బస్టాండు సమీపంలో 961/ఎ సర్వే నెంబరులో 19 సెంట్లు స్థలాన్ని 1954 అక్టోబర్ 10వ తేదీన అప్పటి గ్రామపంచాయతీ అధికారులు పెట్రోలియం పంపు ఏర్పాటుకు లీజుకు ఇచ్చారని., 2015 నుండి నేటి వరకు భారత్ పెట్రోలియం యాజమాన్యం స్పందించకపోవడంతో వారితో 2023 మార్చి 9 వ తేదీన మునిసిపల్ చైర్మన్, కమిషనర్ లు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని.. సమావేశంలో పెట్రోల్ పంపు యాజమాన్యం ఎస్.సత్యనారాయణ అండ్ సన్స్ ఒక మాసం గడువు కోరి నేటికీ స్పందించకపోవడం చేత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారిని ఖాళీ చేయించి స్వాధీనం చేసుకునేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. ప్రజా ప్రయోజనాల రీత్యా పట్టణ పరిధిలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో గల ప్రభుత్వ భూములను మునిసిపాలిటీ స్వాధీనపరచుకొనుటకు జిల్లా కలెక్టర్ అనుమతి కోరుతూ ప్రత్తిపాదనలు సిద్ధం చేశారు. ఎర్రబల్లి, తాళ్లపాక గ్రామాలలో గల 1224/1, 1274/2 సర్వే నంబర్లలో గల 14 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైయస్సార్ ఇండోర్ స్టేడియం కు పది ఎకరాలు, 1224/1, 1274/2 సర్వే నంబర్లలోని 14 ఎకరాలలో వైయస్సార్ శిల్పారామం ఏర్పాటు చేయుటకు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పోలా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం, పట్టణ ప్రజల సౌకర్యార్థం పై నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.