ఉపాధి పనులు పరిశీలిస్తున్న వ్యకాస.నాయకులు
ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలి
వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
అనంతసాగరం:ఉపాధిహామీ చట్టానికి నిధులు పెంచాలని వ్య.కాస.జిల్లా కార్యదర్శి ఎం.పుల్లయ్య డిమాండ్ చేశారు. మండలంలోని ఇనగలూరు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశంలో ఆయన మంగళవారం పర్యటించి కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు. కేవలం 63 వేల కోట్ల రూపాయలు మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఉపాధి హామీ చట్టం పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. ఈ చట్టం సక్రమంగా అమలు జరగాలంటే కేంద్ర బడ్జెట్లో 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలు అవసరం ఉందన్నారు. అలాంటిది కేవలం 63 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. మరోవైపున ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులకు 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయలు కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి ఉపాధి పనుల్లో రెండు పూటలా మస్టర్ విధానాన్ని మానుకోవాలని తెలిపారు.










