Oct 07,2023 16:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి కార్యక్రమాలకు వర్తించే 144 సెక్షన్‌ వైసిపి కార్యక్రమాలకు వర్తించదా? అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విజయవాడలో వైసిపి నిర్వహించే భారీ సమావేశం వల్ల ఎలాంటి సమస్యలు రావని డిజిపి చెప్పగలరా? అని నిలదీశారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాము ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతామని లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నామని చెప్పారు. అయినా తమ కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో అన్ని పార్టీలూ కలిసి చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే సెక్షన్‌ 30ను అమలు చేస్తారని, జగన్‌ నెలల తరబడి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిపై న్యాయస్థానాల్ని ఆశ్రయించబోతున్నామని చెప్పారు. పోలీసుల సాయంతో ప్రజల్ని నిలువరిస్తూ జగన్‌ తప్పించుకుంటున్నారని అన్నారు. జగన్‌ ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి చంద్రబాబును అన్యాయంగా 30 రోజులుగా జైల్లో పెట్టిందన్నారు.

జగన్‌ ఢిల్లీకెళ్లి సాధించింది ఏమిటి? : అనురాధ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమిటని టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, ట్రిపుల్‌ ఐటి నిధులు, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 9,371 ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేశామని ఢిల్లీలో జరిగిన సమావేశంలో సిఎం పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు. రాయలసీమ ఎండిపోయేలా తీర్మానం చేస్తే కేంద్ర జలశక్తి మంత్రిని ఎందుకు కలవలేదని అన్నారు.