- డిఎల్ డిఓ లక్ష్మీపతి వెల్లడి
ప్రజాశక్తి - బి.కొత్తకోట : యూనీఫాం నిబంధనలను ఉల్లంఘించే సచివాలయ సిబ్బందిపై చర్యలు తప్పవని మదనపల్లి డిఎల్ డిఓ లక్ష్మీపతి పేర్కొన్నారు.తంబళ్లపల్లె నియోజకవర్గం,బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఒకరిద్దరు మినహాయించి మిగతా సచివాలయం సిబ్బంది ఎవరు యూనిఫామ్ ధరించడం లేదని సచివాలయ కన్వీనర్లు,మండల కన్వీనర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి అందులో శాశ్వత ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగులను నియమించి వారికి యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.సచివాలయ సిబ్బంది యూనిఫామ్ ధరించకపోవడంతో సచివాలయాలకు సమస్యలపై ప్రజలు వెళ్తే ఎవరు వాలంటీర్లు,ఎవరు సచివాలయం సిబ్బంది అనేది తెలియక ఇబ్బందులు పడుతున్నారన్నారు.మరికొన్ని సచివాలయాల్లోనైతే వృద్ధులు కానీ,ప్రజలకుగానీ వస్తే కనీసం పలకరించకపోవడం,అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం,వారి సమస్యలు తెలుసుకోకపోవడం శోచనీయం.మరీ ముఖ్యంగా ఒకటో సచివాలయంలో ఎప్పుడైనా ఉన్నతాధికారులు తనిఖీ చేసినప్పుడు ఒకటి రెండు రోజులు యూనిఫామ్ ధరిస్తారని,ఆ తర్వాత మళ్లీ షరా మాములేనన్నారు.మరి కొందరైతే సచివాలయాలను తమ ఇళ్లనుగా ఊహించుకొని సచివాలయంలోని గోడకు ఉన్న హ్యాంగర్లకి యూనిఫామ్ తగిలేసి ఉంటారని తెలిపారు.డిఎల్ డిఓ లక్ష్మీపతి బుధవారం గృహనిర్మాణాలపై నాలుగవ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి సైతం ఒకటో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్,ఐదవ సచివాలయం వెల్ఫేర్ యూనిఫామ్ ధరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.మరల ఇది పునరావృతం అయితే సమన్లు జారీ చేస్తామని డిఎల్ డిఓ లక్ష్మీపతి హెచ్చరించారు.ఇకనుంచి ఎవరు యూనిఫామ్ నిబంధనలు పాటించుకున్నా,విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.










