Apr 22,2023 15:46

ప్రజాశక్తి-నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ డిఎంసి రోడ్డులోని అంగన్వాడీ కేంద్రం ముందు ఉన్న, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు రక్షణ కంచ లేకపోవడంతో పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో అన్న అనుమానంలో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ అంగన్వాడిలో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నారు. అంగన్వాడి సెంటర్ కు నీళ్లు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు పలు రకాల ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడి సెంటర్ ముందు కంచ లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అనే భయాందోళనలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ సమీపంలో కొందరు బహిరంగ మలవిసర్జన చేయడంతో దుర్వాసనతో అంగన్వాడీ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అంగన్వాడీ టీచర్ విజయ తెలిపారు. ఇది గాక ప్రతివారం మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్న సంబంధిత అధికారులు, ట్రాన్స్ఫార్మర్ ముందు ఉన్న చిన్న చిన్న మొక్కలు, ముళ్ళ పొదలు కనపడలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అంగన్వాడి  స్కూలుకి గేటును ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ కు కంచ ఏర్పాటు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.