Apr 27,2023 16:21
  • టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : విద్యార్థుల తరపున పోరాడటానికి, జగన్ ను ఇంటికి పంపడానికి టిడిపి సిద్ధంగా ఉందని.. బటన్ ముఖ్యమంత్రి మళ్లీ మళ్లీ బటన్ నొక్కాడానికి సిద్ధమయ్యాడని టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు అధ్యక్షులు పోలి శివకుమార్ అన్నారు. గురువారం టిఎన్ఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వసతి దీవెన పేరుతో మళ్లీ బటన్ నొక్కుడు కార్యక్రమం చేపట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో విద్యార్థులకు ఇచ్చిన డైట్ చార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను తీసివేసి వసతి దీవెన పేరుతో కొత్తగా ఇస్తున్నట్లు పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఎంత? రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? అనే దానిపై శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏడు మెగా డీఎస్సీలు నిర్వహించి ఒక లక్షా 50 వేలు మంది టీచర్లకు పోస్టింగులు ఇచ్చారని, ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క డీఎస్సీ అయినా పెట్టారా అని సూటిగా ప్రశ్నించారు. పాఠశాల మెర్జింగ్ పేరుతో దాదాపు 11 వేల పాఠశాలలు రాష్ట్రంలో మూతపడ్డాయని తెలిపారు. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాటు విదేశీ విద్య గురించి పట్టించుకోలేదని, విదేశీ చదువు కోసం వెళ్ళిన వారి బకాయిలను సైతం చెల్లించ లేదన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల చదువు కోసం చేసిన అప్పులను తీర్చలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. టిడిపి ప్రభుత్వంలో కళాశాలలకు నేరుగా నిధులు వెళ్లేవని, నేడు తల్లిదండ్రుల ఖాతాల్లో నగదు జమ చేయడం వలన సమస్యలు వస్తున్నాయని తెలిపారు. విద్యకు పెద్దపీట వేసింది టిడిపియేనని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ లాంటి దుర్మార్గులు పోయి రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, విద్యార్థుల తరఫున పోరాడడానికి టిడిపి సిద్ధంగా ఉందని తెలియజేశారు.