- మందా శ్రీనివాసులు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో టిడిపి నేతలు ప్రచారానికి వెళ్ళనీయకుండా కడప నగరంలో పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని, పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులురెడ్డిని పోలీసులను అడ్డబెట్టుకొని ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసి ఒంటిమిట్ట కు తీసుకుపోవడం చాలా దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇటువంటి అరెస్టుల వల్ల పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపును ఆపలేరని., ఇది వైసిపి నాయకుల పైశాచిక ఆనందానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. టిడిపి నేతల అరెస్టులను ప్రజాస్వామ్య బద్ధంగా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసిపి నాయకుల దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు.










