May 10,2022 09:24
  • తెచ్చిన అప్పు రూ.3 వేల కోట్లు
  • ఓడికి జమైంది రూ.2,118 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ఖజానా మళ్లీ ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి చేరిపోయింది. జీతాలకు కూడా డబ్బుల్లేక ఈ నెల ఐదో తేదీన రూ.2,118 కోట్లు ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి ఆర్థికశాఖ వెళ్లింది. ఈ నగదుతోనే వాయిదాల పద్ధతిపై కొంతమందికి జీతాలు చెల్లించగలిగారు. ఇదే సమయంలో ఆరో తేదీన సెక్యూరిటీ బాండ్ల తనఖా ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి బహిరంగ మార్కెట్‌ రుణాలుగా రూ.మూడు వేల కోట్లు తీసుకున్నారు. వెరటనే ఈ రుణంలో ఓవర్‌డ్రాఫ్ట్‌కు సంబంధించిన రూ.2,118 కోట్లు రిజర్వు బ్యాంకులో జమైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కేవలం రూ.872 కోట్లు మాత్రమే ఇతర అవసరాలకు మిగిలినట్లు సమాచారం. ఏప్రిల్‌ నెలను ఎటువంటి ఓవర్‌డ్రాఫ్ట్‌ లేకుండానే నెట్టుకు వచ్చిన ఆర్థికశాఖ మే నెల్లో మాత్రం ఓడికి వెళ్లకతప్పలేదు. ఐదో తేదీన ఉపయోగించుకున్న ఓవర్‌డ్రాఫ్ట్‌ వరుసగా మూడు రోజులు కొనసాగడం గమనార్హం. ఏప్రిల్‌ ఆఖరులో మిగుల్చుకున్న నిధులతో మే ఒకటో తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. దీంతో ఖజానా ఖాళీ కావడంతో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లను అందించలేకపోయారు. మూడో తేదీ రంజాన్‌ కావడంతో నాలుగు, ఐదో తేదీల నుంచి జీతాల చెల్లింపులు ప్రారంభించారు. అందుకే ఐదో తేదీన తప్పనిసరిగా ఓడీకి వెళ్లి జీతాలు చెల్లించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నిధులు కూడా చాలకపోవడంతో చాలామందికి ఇంకా జీతాలు పడలేదని తెలిసింది. బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా వచ్చిన నిధులను జీతాలు, పింఛన్లకు వినియోగించుకోవాలంటే అందులో కూడా సింహభాగం నిధులు ఓడి రూపంలో రిజర్వు బ్యాంకులో జమైపోయాయి. ఈ కారణంగానే పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించలేకపోయినట్లు ఒక అధికారి వ్యాఖ్యానించారు.