ప్రజాశక్తి-బొబ్బిలి : తాగునీటి కోసం పట్టణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. పురాతన పైపులైన్ కావడంతో ఎక్కడికక్కడే లీకవడంతో తాగునీరు సరఫరా చేసేందుకు మున్సిపల్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో గొల్లపల్లి, పాతబొబ్బిలి, అమ్మిగారికోనేరుగట్టు, మరికొన్ని ప్రాంతాలకు ఆరు రోజులుగా తాగునీరు అందడం లేదు. దీంతో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చేతిపంపు బోర్లు నీరు వినియోగిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన, మున్సిపల్ ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ యంత్రాంగం స్పందించి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
టెక్కలివలసలో దాహం కేకలు
తెర్లాం : మండలంలో పెరుమాలి పంచాయతీ పరిధిలోని టెక్కలివలసలో నెల రోజుల నుంచి తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో శుక్రవారం ట్యాంకు సమీపంలో రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. కుళాయిల ద్వారా నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా, మోటారు వైండింగ్ కాలిపోయిందని చెప్పారు. స్థానిక సర్పంచ్‌కు చెప్పామని, త్వరలో మోటార్ బాగు చేయించి నీరందిస్తామని ఆయన వివరణ ఇచ్చారు.
కొమిరిలో తాగునీరు వృథా
రేగిడి : మండలంలోని కొమిరి గ్రామంలో దళిత కాలనీలో వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. దీంతో శివారు వీధులకు తాగునీరు అందక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొడ్డవలస వద్ద నాగావళిలో 49 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన పైలెట్ ప్రాజెక్టు నుంచి వచ్చే తాగునీరు వృథాగా పోవడంతో పలు గ్రామాలకు కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. గ్రామంలో కొళాయి నుంచి రోజంతా నీరు వృథా కావడంతో సిసి రోడ్డుపై ప్రవహించి నాచు పట్టి దోమలకు నిలయంగా మారింది. మూడు నెలలుగా నీటి వృథాపై సచివాలయ ఉద్యోగులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సచివాలయ కార్యదర్శి స్పందించి, తాగునీటి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.