Jan 20,2023 15:33

ప్రజాశక్తి-కలకడ: తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది .స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దిగుతాండ పంచాయతీ ఎగువతండాకు చెందిన బుక్కే ప్రసాద్ నాయక్ కుమారుడు బుక్కే చరణ్ పీలేరులోని భారతి డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో కళాశాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. ఈనెల 16వ తేదీన చరణ్ తన తండ్రి ప్రసాద్ నాయక్ జేబులో రూ.500 రూపాయలు తీసుకెళ్లి సిగరెట్లు ,మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.ఈ నేపథ్యంలో చరణ్ తండ్రి ప్రసాద్ నాయక్ ఇలాగా చెడు వ్యసనాలకు బానిస కావడం సరికాదని ,బాగా చదువుకొని మంచి ప్రయోజకుడు కావాలని తండ్రి మందలించాడు. తండ్రి మందలించడంతో అదే రోజు సాయంత్రం చరణ్ మనస్థాపానికి గురై తన ఎడమ చేతి మణికట్టు వద్ద కత్తితో రక్త గాయం చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు గుర్రంకొండ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి వైద్యం చేయించి, ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఈనెల 18వ తేదీన తన తండ్రి ప్రసాద్ నాయక్ ,చెల్లెలు ప్రక్కగల వారి బంధువుల ఇంట్లో నిద్రించారు. ఈ క్రమంలో తన ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించి ఇంటిలో ఉన్న చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం తండ్రి ప్రసాద్ నాయక్, చెల్లెలు వచ్చి ఇంటి తలుపులు తెరవడానికి ప్రయత్నించగా తలుపులు రాకపోవడంతో ఇంటి తలుపులు గడ్డపారులతో పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా చరణ్ విగత జీవిగా చీరకు వేలాడుతూ కనిపించాడు. ఇది చూసిన తండ్రి ,చెల్లెలు బోరున విలపించి, కుమారుడు బాగుపడాలని తాను మందలించానని, ఇలా ప్రయత్నిస్తాడని, ఇలా మాకు దూరం అవుతాడని అనుకొని ఉంటే మందలించే వాడిని కాదని బోరున విలపించారు.