May 31,2023 16:04
  • బంగారు, వెండి నగలు స్వాధీనం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాజంపేట పట్టణం టీ.అగ్రహారానికి చెందిన ముద్దపోలు నవీన్ కుమార్ అనే అంతర్రాష్ట్ర దొంగను పట్టణ పోలీసులు ఈనెల 22వ తేదీన అరెస్టు చేసి అతని వద్ద నుండి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీన పరచుకున్నారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి చైతన్య దొంగతనానికి చెందిన వివరాలను వెల్లడించారు. టీ.అగ్రహారానికి చెందిన నవీన్ కుమార్ పై గతంలోనే 12 దొంగతనాల కేసులు ఉన్నాయని  తెలిపారు. పలు దొంగతనాలకు పాల్పడుతున్న నవీన్ కుమార్ ను 22వ తేదీన టీ అగ్రహారానికి వెళ్లే దారిలో అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రెండు కెనాన్ కెమెరాలను స్వాధీన పరుచుకుని విచారించగా వెండి, బంగారు ఆభరణాల దొంగతనాలకు కూడా పాల్పడినట్లు వెల్లడించాడని తెలిపారు. అతని వద్ద నుండి వెండి పాత్ర, చెంబు, దీపపు కుందులు, గిన్నెలు, కుంకుమ భరణి, లక్ష్మీదేవి విగ్రహాలు, వెండి బిల్లలు, గంధం గిన్నెలు వంటి రూ లక్ష 15 వేలు విలువ చేసే తదితర వెండి వస్తువులతో పాటు, రూ 18 వేలు విలువచేసే బంగారు ఉంగరం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. ముద్దాయిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సైలు వెంకటేశ్వర్లు, లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

  • టపాసుల దుకాణం సీజ్ 

ఎటువంటి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తున్న దుకాణాన్ని సీజ్ చేసినట్లు డి.ఎస్.పి చైతన్య వెల్లడించారు. జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా బండ్రాళ్ల వీధిలో అనుమతులు లేకుండా పచ్చి పులుసు లక్ష్మీనారాయణ విక్రయిస్తున్న టపాసుల దుకాణాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన టపాసుల విలువ రూ 1,76,532 లు ఉంటుందని తెలియజేశారు. అనుమతులు లేకుండా టపాసులు, పేలుడు పదార్థాలను విక్రయించడం, తయారు చేయడం, నిల్వ ఉంచుకోవడం నేరమని.. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.