Jan 22,2023 15:39

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నియామకపు రాత పరీక్షలు మండలంలో ప్రశాంతంగా జరిగాయి. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ మూడు కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. మాస్ కాపీయింగ్ కు చోటు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని నియమించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు నిర్వహించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేకపోవడంతో ఉదయం 9 గంటలకే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించారు. మండలంలోని మూడు పరీక్షా కేంద్రాలలో మహిళా అభ్యర్థులు 914 మంది, పురుష అభ్యర్థులు 3824 మంది కలిపి మొత్తం 4738 మంది అభ్యర్థులు  పరీక్ష రాయాల్సి ఉండగా పురుష అభ్యర్థులు 3331 మంది, మహిళ అభ్యర్థులు 722 మంది పరీక్షకు హాజరయ్యారు. 4738 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 4053 మంది పరీక్షకు హాజరయ్యారు. 685 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మండలంలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల నిష్పత్తి 85.54 గా నమోదైనది.