ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలి : ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక జూనియర్ కలాశాల ఎదుట ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సంద్భంగా ఎస్.ఎఫ్. ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించలేమంటూ, విద్యార్థులే పాఠ్యపుస్తకాలు కొనుక్కోవాలంటూ ఇంటర్ విద్యాశాఖ ఆదేశించడాని ఖండిస్తున్నామని అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం లేదని, పాఠ్య పుస్తకాలు అందించకపోతే విద్యార్థులు ఏ రకంగా చదువుకోవాలని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నామంటూ గొప్పగా చెప్పుకోవడమే తప్ప ఆచరణలో అది కనబడటం లేదని అన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించకపోగా విద్యార్థులు ఫీజులు ద్వారా చెల్లించిన ఇంటర్ విద్యామండలి నిధులు మొత్తం నాడు-నేడు పథకానికి దారి మళ్లించడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే ఇంటర్మీడియట్ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించి, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయాలని.. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యచరణతో ఆందోళనలకు పూనుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, భాష, నరసింహ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










