Sep 20,2023 12:24
  • విశాఖలో సిపిఎం బైక్ యాత్రను ప్రారంభం 

ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన తమ తమ అజెండాలో స్టీల్ ప్లాంట్ రక్షణ అంశం చేర్చాలని లేదంటే ప్రజానీకం ఆయా పార్టీలను ఒడిస్తాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఉదయం 11గంటలకు విశాఖలోని జీవీఎంసీ వద్ద సిపిఎం ఉత్తరాంద్ర బైక్ యాత్ర సభలో ప్రసంగించి, అనంతరం బైక్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు తమ ప్రణాళికలు ప్రకటించే పనిలో ఉన్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు  వ్యతిరేకంగా నిలబడతారా లేక పక్కనపెట్టి ఇతర అంశాలపై వెళ్తారా అన్న దానిపై ఒక ఎజెండాను సెట్ చేసేందుకు ఈ బైక్ యాత్రను చేపట్టామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు పట్టు వదలను విక్రమార్కుల్లాగా రెండు సంవత్సరాల పాటు కుటుంబాలతో సహా వచ్చి పోరాటం జయప్రదం కావాలని చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీల మద్దతు అవసరం ఈ రోజున కార్మిక సంఘాలన్నీ పార్టీలకు అతీతంగా నిలబడి పోరాడుతున్నాయన్నారు. కాబట్టి దాదాపు 1000 రోజులుగా ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వేయలేకపోయిందని అన్నారు. దీనిని మరింత  ఉదృతం చేసి పార్టీలను ఒక్క తాటిపై తీసుకురాగలిగితే స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరు కూడా వచ్చే అవకాశం ఉండదని ఆయన అన్నారు. గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ స్టాటజిక్స్ సెల్ పేరుతో తీర్మానం చేసినప్పటి నుండి పోరాడుతూనే ఉన్నారు. యావత్ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల తరఫున అన్ని సంఘాలు దీనికి సంఘీభావం తెలియజేశాయి. అయినప్పటికీ మోడీ ఏకపక్షంగా స్టీల్ ప్లాంట్ స్థలాలను అదానికి అమ్ముదామా, జిందాల్ కు అమ్ముదామా అన్న తాపత్రయం ఎక్కువగా కనబడుతుందని మండిపడ్డారు. ముడి సరుకు ఇవ్వకుండా గనులు ఇవ్వకుండా ఆటంక పరిచారని తెలిపారు. ఉక్కు వదిలిన భూముల్లో నిర్మించిన గంగవరం పోర్టును అధాని పరం చేశారని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఎందుకు ఇంత కక్షానీ ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పై బిజెపి ప్రభుత్వం వైఖరి  మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇక్కడ అడుగు పెట్టే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. విశాఖపట్నం ఇప్పటికే పారిశ్రామిక రాజధానిగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుందనీ అన్నారు. హాజరైన వివిధ వామపక్షలు, కార్మిక సంఘాల నేతలు గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. చంద్రబాబు అరెస్ట్ పై విఎస్సార్ స్పందిస్తూ ఆయన అక్రమాలు చేస్తే వాటిపై విచారణ చేయడం తప్పు కాదని, ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం కచ్చితంగా రాజకీయ కక్షే అని పేర్కొన్నారు. 

విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకు 54 వేల కోట్ల రూపాయలు డిబిడెంట్గా చెల్లించిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తా ఉంది కరోనా సమయంలో మెడికల్ ఆక్సిజన్ అందించి వేలాది మందిని కాపాడినటువంటి సంజీవని మన స్టీల్ ప్లాంట్ అటువంటి మణిహారాన్ని 100 శాతం అమ్మేయటానికి కేంద్రలోని మోడీ ప్రభుత్వం స్టాటజిక్ సేల్ పేరుతో నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పర్మినెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు వారి కుటుంబాలు వీరికి మద్దతుగా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు కళాకారులు కవులు సమస్త ప్రజానీకం ఈ పోరాటానికి బాధ్యత వహిస్తూ గత 950 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచే క్రమంలో సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లాల బైక్ యాత్ర చేపట్టాలని భావించిందన్నారు. ఈ యాత్ర విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం,  అల్లూరు జిల్లా అనకాపల్లి జిల్లా తిరుగుతూ 29వ తేదీన స్టీల్ ప్లాంట్ కు చేరుకుంటుందన్నారు. మరొక జాత రేపు మద్దెలపాలెంలో ప్రారంభమై విశాఖ నగర వ్యాప్తంగా వాడవాడలా తిరిగేందుకు సన్నద్ధమవుతుందని అన్నారు. ముగింపుగా 29వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. ఈ క్రమంలో పాల్గొనే వారందరికీ సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ఉక్కు పోరాట కమిటీ నాయకులు జె అయోధ్యరాం, ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు మరుపల్లి పైడిరాజు, కొండయ్య, దేవా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాధం తదితరులు పాల్గొన్నారు.