దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్ల సేవలో తరిస్తూ పాలన సాగిస్తామంటే ఈ జాతి సంపద సృష్టికర్తలుగా తాము చూస్తూ ఊరుకోబోమని కార్మిక, కర్షక ఐక్య ప్రజా సైన్యం కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన సార్వత్రిక సమ్మె, చలో ఢిల్లీ, గ్రామీణ బంద్‌లో దాదాపు 25 కోట్ల మంది పైగా కష్టజీవులు ప్రత్యక్షంగా పాల్గొని చరిత్ర సృష్టించారు. 1991లో నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇది 20వ సార్వత్రిక సమ్మె కావడం ఒక విశేషమైతే గడిచిన పది నెలల కాలంలో ఇది రెండో సమ్మె కావడం గమనార్హం. ఇదే ఏడాది జనవరిలో నెలకు రూ.21 వేల కనీస వేతనం, ప్రభుత్వ సంస్థల పరిరక్షణ ప్రధాన డిమాండ్లుగా సార్వత్రిక సమ్మెతో కదం తొక్కిన కార్మికలోకం పది నెలల్లో మరో మారు సార్వత్రిక సమ్మె చేపట్టడం అసాధారణం. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త పిలుపుతో వందలాది ట్రేడ్ యూనియన్లు, కర్షక సంఘాలు ఒక్కతాటిపై నిలిచి కదంతొక్కిన తీరు అపూర్వం. ఆర్‌ఎస్‌ఎస్ కు అనుబంధంగా ఉండే బిఎంఎస్ మాత్రమే సమ్మెకు దూరంగా ఉంది.
బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో శాంతిభద్రతలు ఉండే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోనూ బాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులు ప్రయోగించి తీవ్ర అణిచివేత చర్యలకు పాల్పడినా శ్రమ జీవులు లెక్కచేయలేదు. శత్రు సైన్యం పైకి దండెత్తినట్టు సాయుధ బలగాలను కూడా రంగంలోకి దింపి శ్రమజీవులపై మోడీ సర్కార్ దాష్టీకానికి పాల్పడినా అన్నదాతలు వెన్ను చూపింది లేదు. అడుగు వెనక్కి వేసింది లేదు. లక్షలాదిగా ఢిల్లీ చేరుకొని ఎర్రజెండాలను రెపరెపలాడిస్తూ కవాతు నిర్వహించారు. జాతికి అవసరమైన సంపదను సృష్టించడమే కాదు. ఈ దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణాలను కూడా లెక్కచేయబోమని మిలిటెంట్ పోరాట స్ఫూర్తిని చాటిన కష్టజీవులకు యావత్ భారతావని జేజేలు పలుకుతోంది. వాస్తవానికి శ్రమజీవుల పట్ల మోడీ సర్కార్ మొదటి నుంచీ శత్రుత్వ వైఖరి అవలంబిస్తోంది. దశాబ్దాల పాటు పోరు సల్పి కార్మికులు సాధించుకున్న చట్టాలను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేట్ అనుకూల కోడ్‌లను తీసుకొచ్చి దుర్మార్గానికి పాల్పడింది. కనీస వేతనాలను కుదించి పని గంటలను పెంచేసింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల పట్ల బిజెపి ప్రభుత్వం ఎంతటి అమానవీయంగా వ్యవహరించిందో చూశాం. రెట్టింపు ఆదాయాలతో అన్నదాతలను ఉద్ధరిస్తామని హామీలు గుప్పించి అధికారం లోకి వచ్చిన మోడీ సర్కార్ ఇప్పుడు అదే అన్నదాతలను పాతాళం లోకి నెట్టేస్తోంది. దేశంలో ఎక్కడ మంచి ధర దొరికితే అక్కడికెళ్లి రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చుననే నయవంచక చట్టాలతో వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను మొత్తంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేసింది. తేనె పూసిన కత్తుల్లాంటి ఈ నయవంచక చట్టాలు ఒక వైపు బలవంతంగా రుద్దుతూనే మరోవైపు ప్రభుత్వ సంస్థలను క్రోనీ మిత్రులకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టేస్తోంది. ఈ వినాశకర చర్యలను సహించలేకే కార్మికులు, కర్షకులు ఐక్యంగా కదంతొక్కింది. గతంలో కన్నా ఈసారి ప్రభుత్వ రంగ సంస్థల్లో మరింత మెరుగ్గా సమ్మె జయప్రదం కావడానికి కారణం వాటిని పరిరక్షించుకోవాలనే తపనే. ప్రధాన ఓడరేవులు, హెచ్‌ఎఎల్, బిహెచ్‌ఇఎల్, బిఇఎంఎల్, బెల్, వైజాగ్, సేలం, బొకారో ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజ గనులు, విద్యుత్ రంగం, ప్రజా రవాణా రంగం, రోడ్డు రవాణా, ట్రక్కు ఆపరేటర్లు, నిర్మాణ రంగం, బీడీ కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వంటి పలు ప్రభుత్వ పథకాల కార్మికులు, మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్‌లు, ఐ.టి ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పలు రంగాల శ్రమజీవులు ఈ దఫా సార్వత్రిక సమ్మెలో పాలుపంచున్నారు.
నివర్ తుఫాను ప్రభావంతో మన రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా సమరోత్సాహంతో శ్రామికలోకం కదంతొక్కింది. విశాఖ, నెల్లూరు, కర్నూలు, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కష్టజీవులు చేపట్టిన భారీ ప్రదర్శనలు కార్మికలోక ఐక్యతను చాటాయి. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు ఇంకా మహోద్యమాలను నిర్మిస్తామని కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. కుక్క తోక వంకర లాగా మా విధానాలను మేము మార్చుకోం...కార్పొరేట్ల మేళ్లే మాకు ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి కొనసాగిస్తే కష్టజీవుల ఆగ్రహ జ్వాలలకు బలికాక తప్పదు. జీ హుజూర్ రోజులు పోయాయి. కేంద్రం లోని మోడీ సర్కార్‌కు మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లో కార్పొరేట్ల సేవలో తరిస్తున్న పాలక పక్షాలకూ ఈ సమ్మె, బంద్ ఒక గట్టి హెచ్చరిక.










