ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని అయ్యప్ప నగర్ నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చే చోట స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పాలకొండ, విజయనగరం రహదారిపై పట్టణపౌరసంక్షేమ సంఘం నాయకులు, స్థానికులు బైఠాయించారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేనందున నెలరోజుల్లో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, అయినా అధికారుల్లో చలనం లేదని అన్నారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలని, స్పీడ్‌బ్రేకర్లు ఎందుకు వేయరని ప్రశ్నించారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని, అంతవరకు కదిలేది లేదని భీష్మించారు. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో రెండవ పట్టణ స్టేషన్ పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులను, అయ్యప్పనగర్ వాసులను బలవంతంగా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, యుఎస్ రవికుమార్ మాట్లాడుతూ గత రెండేళ్లగా స్పీడ్ బ్రేకర్స్ వేయాలని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. చివరికి ఎమ్మెల్యేకోలగట్ల వీరభద్రస్వామి కాలనీకి వచ్చి తమ ముందే మున్సిపల్ డిఇకి చెప్పినా అధికారుల్లో స్పందన లేదన్నారు. దీంతో స్పందన కార్యక్రమంలో జెసి కి వినతి పత్రం సమర్పించామన్నారు. జెసి మున్సిపల్ అధికారులను పిలచి మాట్లాడి రెండు రోజుల్లో అయ్యప్ప నగర్, హనుమాన్ నగర్, పాలిటెక్నిక్ కాలేజీ వద్ధ స్పీడ్ బ్రేకర్లు వేయాలని చెప్పారన్నారు. అయినా ఇంతవరకు అధికారులు స్పీడ్‌బ్రేకర్లు వేయకపోవడం వల్ల గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి పలువురు గాయపడి ఆస్పత్రిలో చేరారని తెలిపారు. అధికార్లు వెంటనే అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు వేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో. ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ, సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ, అధ్యక్షడు ఎ.జగన్ మోహన్, అయ్యప్ప నగర్ అసోసియేషన్స్ కార్య దర్శి ఎన్. సుదీర్, ప్రసాద్ , చౌదరి, నారాయణరావు , అయ్యప్ప నగర్ ప్రజలు పాల్గొన్నారు.