ప్రజాశక్తి- వేపాడ : ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి. రమణ పిలపునిచ్చారు. బుధవారం సోంపురం జంక్షన్ నుంచి జాకేరు, రామస్వామి పేట క్వారీలలో పాద యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలకు ఎన్నో నష్టాలున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం దుర్మార్గపు పాలనకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో సిఐటియు నాయకులు చల్లా జగన్, ఆశా, కార్మికులు పాల్గొన్నారు.
లక్కవరపుకోట : సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర బుధవారం చందులూరు, మార్లాపల్లి, సంతపేట, లక్కవరపుకోట, సోంపురం మీదుగా వేపాడకు చేరుకుంది. పాదయాత్ర నిర్వహిస్తున్న నాయకులకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు తిలకాలు దిద్ది ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ మాట్లాడుతూ ఉపాధి కార్మికులకు 200 పని దినాలు కల్పిస్తూ దినసరి వేతనం రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి స్కీమ్ వర్కర్స్‌లను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గాడి అప్పారావు, చల్లా జగన్ , జి. సింహాచలం, తరణి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె విజయవంతానికి ప్రచారం
పార్వతీపురం : సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పార్వతీపురం జిల్లా అధ్యక్షులు జి.వెంకటరమణ ఆధ్వర్యాన మున్సిపల్ కార్మికులు బుధవారం ప్రచారం చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ సమ్మె ప్రాధాన్యతను వివరిస్తూ విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను సమ్మె ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు బంగారు రవి, మంగళగిరి శ్రీను, గంగయ్యలు, సొండి సౌరి, రాజు, జలగడుగుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.










