Mar 20,2022 02:08

గేట్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న సిఐటియు కాలం సుబ్బారావు

ప్రజాశక్తి-చీమకుర్తి
ఈ నెల 28,29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం ఆయన గ్రానైట్‌ క్వారీలలో పర్యటించి కార్మికులతో గేట్‌ మీటింగ్‌లలో మాట్లాడారు. ఆయన మట్లాడుతూ కేంద్రంలోని బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడుగా కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్స్‌ తీసుకొచ్చిందన్నారు. ఇవి యజమానులకు అనుకూలంగా మార్పు చేశారన్నారు. రోజురోజుకూ కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. మరోవైపు కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మివేస్తున్నాయన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫాక్టరీని 100 శాతం అమ్మివేస్తామని కేంద్ర ప్రభుత్వం నిసిగ్గుగా చెబుతుందని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దీన్ని కాపాడుకోవాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూలీలకు ఉపాధి పనులు లేవన్నారు. ఉపాధి హామీకి నిధుల కేటాయింపు తగ్గించారన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28,29 తేదీలలో జరుగు సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు, గ్రానైట్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి బి వీరాంజనేయులు, బి ఓబులేసు, అప్పలనాయుడు, వెంకటేష్‌, శ్రీను, పాండు పాల్గొన్నారు.