ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు ప్రచార జాతాను సిఐటియు జిల్లా కార్యదర్శి పి.కల్పన ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న, సెక్యూరిటీ గార్డ్స్‌కు కనీస వేతనం అమలుచేయాలని పీఎఫ్, ఈఎస్‌ఐ పెండింగ్ వెంటనే పరిష్కరించాల న్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న పారిశుధ్య విభాగంలో కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, లేకపోతే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిఐటియు నగర అధ్యక్షులు దామా శ్రీనివాసులు, నగర కార్యదర్శి టి మహేష్ మాట్లాడుతూ 28వ తేదీన ఉదయం 9 గంటలకు ఆర్టీసీ డిపో నుండి కలెక్టరేట్ వరకు జరిగే కార్మిక ప్రదర్శనలో కార్మిక వర్గం అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు ఒంగోలు నగర నాయకులు తంబి శ్రీనివాసులు, దాసరి రమేష్, అత్తింటి శ్రీనివాసరావు, శ్రీరామశ్రీనివాసరావు, ఆర్.రాయలు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
గిద్దలూరు: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డిఎంకే.రఫీ, ఎం.రమేష్ కోరారు. పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రచారజాతాలో మాట్లాడారు. రైతు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, కార్మిక హక్కులను పరిరక్షించుకోవడానికి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ప్రచారంలో సిఐటియు నాయకులు ఆవులయ్య, థామస్, ప్రజానాట్యమండలి నాయకులు రూబెన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగయ్య, చంటియ్య, పాపయ్య, రంగయ్య, రవణమ్మ, చెన్నమ్మ పాల్గొన్నారు.










