Mar 18,2022 22:00

గుమ్మలక్ష్మీపురం : జీపుజాతాలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజాసంక్షేమ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 28, 29 తేదీల్లో చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు గొర్లె వెంకటరమణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి జీపు జాతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభం సృష్టిస్తూ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అదాపీ, అంబానీలకు కట్టబెట్టే పనిలో ఉందన్నారు. నూతన వ్యవసాయ చట్టాల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలలను ఎత్తివేసి గిరిజన విద్యార్థులను చదువుకు దూరం చేయడం, అంగన్వాడీ వ్యవస్థను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం వంటి కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయని ఆరోపించారు. లేబర్‌కోడ్‌ల రద్దు, సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజేషన్‌, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికై రైతుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకై మార్చి 28, 29 తేదీల్లో చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. గుమ్మలక్ష్మీపురం నుంచి ఎల్విన్‌ పేట వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కోలక అవినాష్‌, మండంగి రమణ, మోహన్‌ రావు మండల కార్యదర్శి కే గౌరీశ్వర రావు అంగనవాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
కురుపాం : స్థానిక రావాడ కూడలి వద్ద శుక్రవారం జరిగిన జీపు జాతా కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు గొర్లి సన్యాసిరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కె.అవినాష్‌, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన జీపుజాతా మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జీపు జాతాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు గొర్లి వెంకటరమణ, కార్యదర్శి బి.వెంకటరమణ మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జి.జయమ్మ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కోలక అవినాష్‌, నాయకులు కొల్లి సాంబమూర్తి, ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు నాయకులు దుర్గా, భవన కార్మిక సంఘం నాయకులు యామక గౌరినాయుడు, ఆటో యూనియన్‌ నాయకులు వెంకట్‌, అంగన్వాడీ మిడ్డేమీల్స్‌, ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు సుజాత, హేమలత, లలిత, అనురాధ, దుర్గమ్మ, సునీత, రవణమ్మ, కృష్ణవేణి, పార్వతి, మంగమ్మ పాల్గొన్నారు.