ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగించే బిజెపి పాలన నుంచి దేశాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఈనెల 28,29 తేదీలలో జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక కోట జంక్షన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. మూడులాంతర్లు, ఎంజి రోడ్డు, కన్యకా పరమేశ్వరి జంక్షన్, ఎన్‌సిఎస్, రైల్వే స్టేషన్, మయూరి జంక్షన్ మీదుగా అర్‌టిసి కాంప్లెక్స్ వరకు సాగింది. ఈ సందర్భగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే పాలన సాగిస్తున్నారని అన్నారు. మరోవైపు రోజు రోజుకూ ఆయిల్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేస్తున్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మిక హక్కులను కాల రాసే కార్మిక కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్ల ను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని కోరుతూ జరుగుతున్న జాతీయ సమ్మెలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. బైక్ ర్యాలీలో సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జి.అప్పలసూరి, టివి రమణ, నాయకులు రెడ్డి శంకరరావు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవి అర్‌కె ఈశ్వరరావు, కె.శ్రీనివాసరావు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యుఎస్ రవికుమార్, బి.రమణ, కె.సురేష్, ఎస్‌ఎఫ్ ఐ నాయకులు హర్ష తదితరులు పాల్గొన్నారు. ర్యాలీకి ముందు ప్రజాశక్తి ముద్రించిన సమ్మె ప్రత్యేక సంచికను కోట వద్ద మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు ఆవిష్కరించారు.
అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కనీస వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. సమ్మె జయప్రదానికి ఈనెల 10న సిఐటియు నాయకులు చేపట్టిన పాదయాత్ర శనివారం దాబాతోట, కోళ్ల బజార్, మెయిన్ రోడ్డు, గంటస్తంభం, పాత బస్టాండ్, ప్రకాశం పార్క్, లంకాపట్నం తదితర ప్రాంతాల్లో సాగింది. దాబా తోటలో జరిగిన సభలో సుబ్బరామమ్మ మాట్లాడారు. పలు సంస్థల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం కోసం 2022 మార్చి 28, 29 తేదీలలో జరుగుతున్న సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, నగర అధ్యక్షుడు బి.రమణ, నాయకులు రెడ్డి శంకర్రావు, కె.సురేష్, కె.అప్పలనాయుడు, జి.సింహాచలం, శ్రీను, రామకృష్ణ, హరీష్, హర్ష తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశం
పార్వతీపురం : సమ్మె జయప్రదం చేయాలని శనివారం స్థానిక సుందరయ్య భవనంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి వెంకట రమణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, హక్కులను పరిరక్షించుకోవడానికి ఈనెల 28, 29 తేదీల్లో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బంటు దాసు, సిపిఐ నాయకులు పి.సంఘం, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె. రామస్వామి, నాయకులు సూరిబాబు, ఎం.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోడ్ల సెంటర్లో ఇఫ్టూ అనుబంధ వర్తక కళాసీ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు, ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యుడు జి.సర్వేశ్వరరావు, కళాసీ సంఘం కార్యదర్శి ఆర్.సర్వేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఎఐకెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.నరసింగరావు, పిఒడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రమణి సమ్మెకు మద్దతు తెలిపారు.
కొనసాగుతున్న ఆటోజాతా
బొండపల్లి : సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యాన ఆటో ప్రచారం బొండపల్లి మండలంలోని బొండపల్లి, గొట్లాం, దేవుపల్లిలో శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో హైమ, సిహెచ్.కుమారి, ధనలక్ష్మి పాల్గొన్నారు.
జామి : సమ్మెను జయ ప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి పిలుపునిచ్చారు. జామి బస్‌స్టాండ్ లో ప్రచార జాతా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అనసూయ, మద్దిల రమణ, ముత్యాలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి : పట్టణంలోని జెండా మహల్ జంక్షన్ వద్ద సమ్మె పోస్టర్‌ను ఎఐటియుసి జిల్లా ఉప ప్రధానకార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యాన విడుదల చేశారు. కార్యక్రమంలో కొలుసు సత్యనారాయణ, బూడి రామారావు, తిరుపతి రావు సత్యనారాయణ పాల్గొన్నారు.










