Aug 30,2020 07:34


ఉద్యోగుల సామాజిక భద్రతకు గొడ్డలి పెట్టుగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని (సిపిఎస్‌) రద్దు చేస్తామని 2019 సాధారణ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించడమే కాక...తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎన్నికల ముందు జరిపిన పాదయాత్రలో తాము అధికారం లోకి వచ్చిన నెల రోజుల్లోగా సిపిఎస్‌ రద్దు చేస్తామని పలుమార్లు ప్రకటించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో సిపిఎస్‌ రద్దు, సకాలంలో పిఆర్‌సి అమలు ప్రత్యేకంగా పేర్కొన్నారు. కొత్త పార్టీకి అవకాశం ఇస్తే సిపిఎస్‌ రద్దు చేస్తారనే నమ్మకంతో వైఎస్‌ఆర్‌సిపి కి పట్టం కట్టారు. అధికారం లోకి వచ్చి 15 నెలలు గడిచినా సిపిఎస్‌ రద్దుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సిపిఎస్‌ అమలు చేసిన సెప్టెంబర్‌ 1వ తేదీన ఉద్యోగులకు విద్రోహ దినంగా పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహం చేపట్టనుంది.
వృద్ధాప్యంలో సామాజికంగా భద్రత కల్పిస్తున్న డిఫైన్డ్‌ పెన్షన్‌ పథకాన్ని రద్దు చేసే ప్రక్రియకు బిజెపి ప్రభుత్వం 2001 లోనే శ్రీకారం చుట్టింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాలతో ఆర్థిక సంస్కరణలలో భాగంగా మన దేశంలో (01.01.2004 నుంచి) కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సిపిఎస్‌) అమలు లోకి తెచ్చి 16 సంవత్సరాలు పూర్తి అయింది. ఉన్న పెన్షన్‌ సౌకర్యం తొలగించి గ్యారెంటీ లేని సిపిఎస్‌ పథకం అమలు చేయడంతో దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అన్ని రంగాల్లో ఉద్యమాలు, అఖిల భారత సమ్మెలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో సిపిఎస్‌ వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకున్నాయి. యుటియఫ్‌, ఫ్యాప్టో ఐక్య వేదికలతోపాటు వివిధ సంఘాలు పెద్ద ఎత్తున కదిలాయి.
టక్కర్‌ కమిటీ రిపోర్టులో...
అన్ని సంఘాలతో చర్చించిన టక్కర్‌ కమిటీ సిపిఎస్‌ అమలులో ఉంది. సిపిఎస్‌ పథకం ఉద్యోగులకు నష్టమే, కాని పాత పెన్షన్‌ పథకం ప్రభుత్వాలకు భారంగా మారుతోందని ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ చెప్పిందే తన రిపోర్టులో చెప్పారు. దానితోపాటు రాష్ట్రంలో సిపిఎస్‌ కొనసాగిస్తూనే పాత పెన్షన్‌ విధానంలో వచ్చే కనీస పెన్షన్‌ గ్యారెంటీ ఇవ్వాలని, మినిమం పెన్షన్‌కు తగ్గితే ప్రభుత్వమే భరించాలని, అందుకోసం ప్రతి యేటా బడ్జెట్‌ నుండి పెన్షన్‌ ఫండ్‌ కేటాయించాలని ఆ నివేదికలో ప్రతిపాదించారు. అంటే ఉద్యోగులు తమ వాటా 10 శాతం చెల్లిస్తూనే ఉండాలి, షేర్‌ మార్కెట్‌లో మన పెట్టుబడులు అలాగే ఉండాలి, అదనంగా రాష్ట్ర బడ్జెట్‌ నుండి కొంత సొమ్ము పెన్షన్‌కి కేటాయించాలి. తక్షణమే తీర్చవలసిన ప్రజావసరాలకు కూడా సొమ్ము లేని రాష్ట్ర ప్రభుత్వం 20/30 సంవత్సరాల తర్వాత ఉద్యోగులకు చెల్లించడం కోసం కొంత మొత్తాన్ని ప్రతి ఏటా దాచిపెట్టడం సాధ్యపడేదేనా? అధికారాలు మారితే పాత ప్రభుత్వాల పథకాలు రద్దుచేస్తున్న నేటి పరిస్థితులలో ఈ ప్రతిపాదన నిలబడుతుందా? దీనికి గ్యారెంటీ ఏమిటి? బడ్జెట్‌ నుండి ఫండ్‌ తప్పనిసరిగా కేటాయిస్తారని ఎవరు చెప్పగలరు! ఇవన్నీ రాయితీలు, సలహాలు మాత్రమే. చట్టబద్ధం చేసేదెవరు? టక్కర్‌ నివేదిక పాత పెన్షన్‌ విధానమే కావాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను నీరుగార్చేందుకు తోడ్పడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 15 నెలల్లో సుమారు 800 మంది సిపిఎస్‌ ఉద్యోగులు రిటైరయ్యారు. వారు కేవలం రూ.1500 నుండి రూ.2000 మాత్రమే పెన్షన్‌ పొందుతున్నారు. ఇది వృద్ధాప్య పెన్షన్‌ కంటే తక్కువగా వుంది. ప్రభుత్వం చెల్లించవలసిన 10 శాతం వాటా కూడా రెగ్యులర్‌ జమ కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తన వాటా 10 శాతం నుండి 14 శాతానికి పెంచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 10 శాతమే కొన సాగిస్తుంది. 01.01.2004కు ముందు విడుదలైన నోటిఫికేషన్‌ ద్వారా సెలెక్టయి ఆ తర్వాత ఉద్యోగాలు పొందిన వారికి పాత పెన్షన్‌ వర్తింపచేయాలని కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో 2002 (పండితులు, బ్లయిండ్‌ టీచర్లు), 2003 డిఎస్‌సి ద్వారా ఎంపికై 2004 తర్వాత చేరిన వారికి పాత పెన్షన్‌ ఇవ్వవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ముందడుగు వేయలేదు. అందువల్లే సిపిఎస్‌ రద్దు పట్ల ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి. ఎన్‌ఎస్‌డిఎల్‌ ద్వారా పిఎఫ్‌ఆర్‌డిఏ లో జమ అయిన రూ.10,900 కోట్లు వెనక్కి తేవాలి. అందరికి పి.ఎఫ్‌ ఖాతాలు ప్రారంభించి అందులో జమ చేయాలి. అంటే పిఎఫ్‌ఆర్‌డి తో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తే ఉద్యోగులు సహించరు.
-పి. బాబురెడ్డి
(వ్యాసకర్త యుటియఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)