ప్రజాశక్తి - పూసపాటిరేగ : మండలంలోని సిపి ఆక్వా పరిశ్రమ అక్రమ లాకవుట్ను వెంటనే ఎత్తేయాలని మైలాన్ కాంట్రాక్ట వర్కర్స్ యూనియన్ అధ్యక్షలు నల్ల అప్పలరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కొంతమంది కార్మికులు, యాజమాన్యం మద్య తలెత్తిన వాగ్వివాదం కారణంగా నెల రోజులుగా సిపి ఆక్వా పరిశ్రమ అక్రమ లాకవుట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అక్రమ లాకవుట్ను ఎత్తివేయాలని పలుమార్లు జిల్లా, మండల అధికార్లుకు కార్మికులు వినతిలు ఇచ్చారు. అయితే సుమారుగా నెల రోజులు అవుతున్నా సమస్య కొలిక్కి రాకపోవడంతో బుధవారం మండలంలోని గైతులు చోడవరంలో కార్మికులు సమావేశం ఏర్పాటు చేసి పలువురు ప్రజా ప్రతినిధులును ఆహ్వానించారు. మమ్మల్ని అక్రమంగా తొలగించే ప్రయత్నం జరుగుతొందని, మీరంతా మాకు సహకారం అందించాలని కార్మికులు ప్రజా ప్రతినిధులను కోరారు. దానికి ప్రజా ప్రతినిధులంతా సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం వారంతా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని సమస్యను రెవెన్యూ అధికార్లుకు వివరించారు. ఈ సందర్బంగా అప్పలరాజు మాట్లాడుతూ పరిశ్రమలో ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించేందుకు యాజమాన్యం సిద్దంగా ఉన్నా కాంట్రాక్ట్ర్సు దాన్ని పక్కతోవ పట్టిస్తున్నారన్నారు. డిసిఎల్ సమావేశానికి యాజమాన్యాన్ని రానివ్వకుండా కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎంతమంది కార్మికులను ఆపామో అందరిని తీసుకుంటామని యాజమాన్యం మాకు మాట ఇచ్చిందన్నారు. తరువాత కాంట్రాక్ట్ర్లు కలసి యాజమాన్యానికి రహస్యంగా మద్దతు తెలపడంతో సమస్య జటిలమవుతొందన్నారు. ఇప్పటికే కార్మికులు ఆవేదనకు గురవుతున్నారన్నారు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. చోడమ్మ అగ్రహారం ఎంపిటిసి ఎన్. సత్యనారాయణ రాజు కార్మికులకు సహాకారం అందించకుండా యాజమాన్యం కొమ్ముకాస్తున్నారంటూ కార్మికులు ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం తాను కృషి చేస్తున్నానని, సత్యనారాయణ రాజు కార్మికులుకు వివరించారు. సమావేశంలో పూసపాటిరేగ, చోడమ్మ అగ్రహారం సర్పంచులు టొంపల సీతారాం, కొత్తకోట శ్రీరాములు, కనిమెట్ట సర్పంచ్ భర్త గోవింద, సాంతాటి శ్రీనువాసరావు, జలపాల శ్రీను, పల్ల సత్యం, తదితర కార్మికులు పాల్గొన్నారు.