'కనపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్/ కనపడుట లేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్' అంటాడు గుర్రం జాషువా. ప్రపంచంలో జంతువులను అత్యధికంగా ప్రేమించే వాళ్లున్నారు గానీ, మనుషులను ఇంతగా హీనపరిచిన జాతి ఎక్కడాలేదేమో! ఈ సమాజంలోని మనుషులు కలిసి మెలిసి జీవించకుండా కొందరిని అణచివేయడం, అవమానించడం, దానికి కులాన్ని, మతాన్ని పునాదిగా చేయడం, దేవుడు అనే వ్యవస్థను కాపలా పెట్టడం, భూస్వాములు దీనికి వంత పాడటం... ఇదంతా ఒక ప్రణాళికాబద్దమైన కుట్ర. ఇది ఈ దేశంలో నేటికీ వేళ్లూనుకొనివున్న మనువాదం ప్రధాన అజెండా. అది తాము మనుషులన్న స్పహ లేకుండా దళితులను నడిచే శవాలను, జీవచ్ఛవాలను చేసింది. పుట్టుకతోనే ఒక వ్యక్తిని అస్పశ్యునిగా పరిగణించడం, సాటి మనిషిని అంటరానివానిగా చూడటం మానవత్వానికే పెను విఘాతం. శతాబ్దాలుగా సాగిన ఈ వివక్ష మాసిపోవాలన్న స్వప్నం... ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77ఏళ్లలోనూ సాకారం కానేలేదు. అంటరాని వారు అంటూనే వారి శ్రమశక్తిని కొల్లగొడుతూ పశువుల కన్నా హీనంగా చూస్తుండటం చారిత్రక సత్యం. ఈ వివక్షను అంతమొందించాలన్న ఆశయం, రాజ్యాంగం సాక్షిగా మన కళ్లముందు కదలాడుతున్నా... కళ్లకు మనువాద గంతలు కట్టుకున్న గుర్రాల మాదిరి వ్యవహరించేవారికి ఆ ఆశయం కనిపించదు.
రిజర్వేషన్ అనేది సమాజంలోని ఆధిపత్య వ్యవస్థల ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న కులాలకు ఊరట కలిగించడం కోసం రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన ఒక సౌకర్యం. కానీ బిజెపి హిందూ మతంలో వుంటేనే రిజర్వేషన్ అని వాదిస్తోంది. అంటరానితనం, వివక్షత, వెనుకబాటుతనం ఈ దేశంలో కేవలం హిందూమతానికే పరిమితం అయిలేదు. ఇతర మతాలలోనూ వుంది. అటువంటప్పుడు సామాజిక రిజర్వేషన్‌ను మతపరమైన వివాదంగా మార్చాలని బిజెపి ప్రయత్నించడం కుట్ర కాదా? హిందూమతానికే అంటరానితనం స్వంతం అని బిజెపి చెప్పదలిచిందా? ఆ అంటరానితనాన్ని గర్వకారణంగా పరిగణిస్తోందా? లేక వదిలించుకోవాలని భావిస్తోందా? వదిలించుకోవాలనుకుంటే అందుకు చేపట్టిన కార్యాచరణ ఏమిటి? దళితులపై దాడులు చేసినవారి పక్షాన బిజెపి ఎందుకు నిలబడుతోంది. ఆరెస్సెస్ అధినేత రిజర్వేషన్లపై జాతీయ చర్చ జరగాలని ప్రకటించారు. కానీ కులవివక్షతపై, దళితులపై సాగుతున్న అత్యాచారాలపై జాతీయస్థాయిలో చర్చకు సిద్ధపడతారా? దేశంలో రోజూ పది మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు గతేడాది లెక్కలు చెబుతున్నాయి. ఈ ఘటనలు కూడా బిజెపి పాలిత రాష్ట్రాలలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలో సంచలనం సష్టించిన హథ్రాస్ ఘటనే ఇందుకు సాక్ష్యం. హథ్రాస్ ఘటన పెద్ద కులపోళ్ల తీరును మరోసారి రుజువు చేసిందని హక్కుల కార్యకర్తలు సైతం చెబుతున్నారు. అన్యాయం జరిగిందని పోలీస్‌స్టేషన్ మెట్లెక్కినా ఫిర్యాదు తీసుకునే దిక్కు లేదు. అసలు అత్యాచారమే జరగలేదు పొమ్మన్నారు.
కేంద్రంలో వున్న బిజెపియే కాదు, కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్‌సిపి, జనసేన వగైరా పార్టీలు సైతం దళితులను ఓట్లు అవసరమొచ్చినప్పుడే స్మరిస్తారు. వారిపై దాడులు జరుగుతున్నప్పుడు మాత్రం నోళ్లు విప్పరు. దాడులు చేసిన పెద్దకులాల ఓట్లు, నోట్లు ఈ పార్టీలకు కావాలి. ఈ అవకాశవాద రాజకీయాలను అణగారిన ప్రజలంతా గ్రహించాలి. భారతీయ సమాజంలో నిచ్చెన మెట్ల లాంటి కులవ్యవస్థను పెంచిపోషించేది మనువాద భావజాలం. ఈ అమానుష వ్యవస్థ పోయి కులవివక్ష, అంటరానితనం సమసిపోవాలంటే ఈ దేశంలో జాతీయోద్యమ స్థాయిలో సామాజిక విప్లవం రావాలి. నేటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్న కాప్ పంచాయితీలు, కుల తీర్పులను ఎదుర్కొని, అత్యాచారాల బాధితులకు అండగా నిలిచే వారంతా ఏకమై ఉద్యమించాలి.










