Mar 21,2022 23:54

సమావేశంలో మాట్లాడుతున్న పి.కల్పన

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈనెల 28. 29 తేదీలలో నిర్వహిస్తున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆశ వర్కర్లు పాల్గొనాలని ఆశా వర్కర్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.కల్పన పిలుపు నిచ్చారు. ఆశా వర్కర్‌ యూనియన్‌ జిల్లా విస్తతస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ ఆశా వర్కర్లు రోజువారీ పని చేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, పిల్లల చదువులు, హాస్పిటల్‌ ఖర్చులకు వినియోగదారుల సూచీ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా వారి వేతనాలు ఉండాలన్నారు. ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి పర్మినెంట్‌ చేయాలన్నారు. ఆశ్కా వర్కర్లు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి ఏ హక్కులు వర్తించడం లేదన్నారు. పని భద్రత లేదని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ లేవన్నారు. ఆశా వర్కర్స్‌ కార్మికులుగా గుర్తించి పర్మినెంట్‌ చేయాలని, ఆరోగ్య రంగానికి జిడిపి లో ఆరు శాతం నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. డాక్టర్లు ఇతర సిబ్బంది ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. హాస్పిటల్‌లలో ప్రజలకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సరైన సౌకర్యాలు కల్పించేందుకు బడ్జెట్‌లో 6 శాతం నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, లీజుకు ఇవ్వటాన్ని మాను కోవాలన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ప్రైవేట్‌, కార్పొరేట్లకు కట్టబెడితే నిరుద్యోగం పెరిగి రిజర్వేషన్లు రద్దు అవుతాయని తెలిపారు. ప్రజలపై మరింత భారాలు పడతాయని తెలిపారు. కరోనా సమయంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి ప్రజలు చనిపోకుండా కాపాడిందన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ అడ్డుకోకపోతే పిల్లలు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.కార్మిక చట్టాలను పటిష్ఠ పరచాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలి పెరగటం లేదన్నారు. అనేకమంది పౌష్టికాహారం అందక రక్తహీనతతో అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. ధరల పెరుగుదలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.