ప్రజాశక్తి - గిద్దలూరు : బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28 29 తేదీల్లో నిర్వహిస్తున్న దేశ వ్యాప్త సమ్మె జయద్రం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి కోరారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణంలో సిఐటియు జనరల్ బాడీ సమావేశం ఆవులయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పంగించి కార్మికులను రోడ్డున పడేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు తామస్, నరసింహులు, సింగరయ్య సుబ్బరాజు, పద్మావతి, కుమారి, లక్ష్మీదేవి, నరసమ్మ, బాషా, సుజాత, సమీరా, విశ్రాంతి, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా బాల నాగయ్య కోరారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసి వాటి స్ధానంలో యాజమాన్యాలకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నాలుగు లెబర్ కోడ్‌లను తెచ్చిందని విమర్శించారు. ప్రజలు తమ కష్టార్జితంతో సంపదను పోగు చేసి ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్మిస్తే మోడీ ప్రభుత్వం ఆ సంపదను మొత్తం కారు చౌకగా విదేశి, స్వదేశి గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతుందని విమర్శించారు. దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అద్దంకి : ఈ నెల 28 29 తేదీల్లో నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్.గంగయ్య కోరారు. సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, కార్మిక సంక్షే మాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించాయన్నారు. లేబర్ హక్కులను కాలరాస్తూ యజమానులకు ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పి.కల్పన, పి.ఆదాం, మోండ్రు చిన సుబ్బారావు, గుంజి వెంకటరావు పాల్గొన్నారు










