సాంప్రదాయబద్ధంగా పోలేరమ్మ ఉత్సవం
ప్రజాశక్తి-అల్లూరు : సాంప్రదాయ బద్ధంగా అంగరంగ వైభవంగా పోలేరమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రం స్థానిక ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉత్సవానికి సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతియేటా కుల, మతాలకు అతీతంగా ఊరు పెద్దల సహకారంతో గంగమ్మ కలుగోళమ్మ, పోలేరమ్మలకు ఒకేపారి ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అమ్మవారికి ప్రసాదాలు నిర్వహిస్తున్న క్రమంలో ముస్లిములు, క్రైస్తవులు విచ్చేసి స్వీకరిస్తున్నారని తెలిపారు. సద్ది నివేదన, కథా కాలక్షేపం, బైనాడి ఆచారాలు, కొమ్ము తదితర ఆచారాలతో ముగ్గురు అమ్మవార్లను ఊరేగిస్తామని ఆయన తెలిపారు. ఉత్సవాన్ని నిర్వహిస్తున్న నాటి నుండి గ్రామం సుభిక్షంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆ తల్లి ఆశీస్సులతో అందరికీ మంచి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. అధికారుల సహకారం మెండుగా ఉందని అందులో భాగంగా కావలి ఆర్‌డిఒ శీనానాయక్ నేతృత్వంలో సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఇరిగేషన్ శానిటైజేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, నగర పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని కోరారు. ఎప్పుడు ఉత్సవం నిర్వహించినా భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతేడాది భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతుందని ఈ ఉత్సవాన్ని రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెస్తామని హామీనిచ్చారు. అనంతరం అల్లూరుపేటలోని గంగమ్మ దేవాలయం, కలగోళమ్మ దేవస్థానాలను పరిశీలించారు. కార్యక్రమంలో బాలకష్ణం రాజు తదితరులు ఉన్నారు.










