అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఓటమి భూతం ఆవహించింది. దీంతో ఆయనలో నియంతృత్వ పోకడలు రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. నవంబరు 3న జరిగే ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయం అని ఆయన అనుకూల 'రాస్‌మసేన్ పోల్' తో సహా అన్ని ఒపీనియన్ పోల్స్ ఢంకా భజాయించి చెబుతున్నాయి. నాలుగేళ్లలోనే అమెరికన్ల నుంచి ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణం ఆయన అనుసరించిన విధానాలే. ఈ నాలుగేళ్ల పాలనలో అమెరికాలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమైంది. అమెరికన్ బడా చమురు కంపెనీలు, పన్ను ఎగవేతదారులు, బహుళజాతి సంస్థలు, వాల్ స్ట్రీట్ యజమానుల ప్రయోజనాలను కాపాడడం కోసం అసంఖ్యాక అమెరికన్ల కుటుంబాల జీవితాలను ఛిద్రం చేశారు. ఒబామా కేర్‌ను రద్దు చేసి, ప్రజారోగ్యాన్ని కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని తెలసినా దీనిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. కరోనా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని బడా కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేలా చూశారు. ట్రంప్ నిర్లక్ష్యానికి ఇప్పటికే 2,13,000 మంది చనిపోయారు. విధానాల ఆధారంగా ప్రజలను ఒప్పించి అధికారంలోకి రావడం కల్ల అని ట్రంప్‌నకు, ఆయన వెనక ఉన్న కార్పొరేట్ మద్దతుదారులకు తెలుసు. ఫ్లోరిడా, కాలిఫోర్నియా వంటి పెద్ద రాష్ట్రాలు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. రిపబ్లికన్లకు బలమైన రాష్ట్రంగా చెప్పబడే జార్జియా కూడా ట్రంప్ చేజారుతుందన్న సంకేతాలు వెలువడుతుండడం ట్రంప్‌ను మరింత కలవరపరుస్తోంది. 2016లో పాపులర్ ఓటు ద్వారా కాకుండా ఎలక్టొరల్ కాలేజీలో మెజార్టీ ద్వారా అధికారంలోకి వచ్చిన ట్రంప్‌నకు ఈసారి ఆ అవకాశం కూడా ఉండదని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఎన్నికలు న్యాయంగా, స్వేచ్ఛగా జరిగితే తాను గెలవడం అసాధ్యమని గ్రహించాడు. ఎన్నికలు సాఫీగా సాగకుండా చేసేందుకు, ఓటర్లను బెదిరించేందుకు, పోస్టల్ బ్యాలెట్లను ధ్వంసం చేసేందుకు రిపబ్లికన్ జాతీయ కమిటీ (ఆర్‌ఎన్‌సి) ఇప్పటికే 50 వేల మందితో ప్రైవేట్ సైన్యాన్ని సిద్ధం చేసింది. శ్వేత జాతి దుర్హంకార 'ప్రౌడ్ బార్సు' గ్యాంగ్‌లను ట్రంప్ బాహాటంగానే ప్రోత్సహిస్తున్నాడు. ఓటర్ల జాబితా నుంచి ఒక వర్ణానికి చెందిన వారి పేర్లను తొలగించడం, డెమొక్రాట్లు, మైనార్టీలు గణనీయమైన సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను బెదిరించడం, పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా ఎక్కడికక్కడ ఈ గ్యాంగ్‌లను మోహరించడం వంటి పనులను ఈ గ్యాంగ్‌లకు అప్పగిస్తారు. మిషిగన్‌లో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన మహిళా గవర్నరు విట్మేయర్‌ను దేశద్రోహ నేరం కింద విచారించాలని డిమాండ్ చేసినది, ఆమె కిడ్నాప్‌నకు కుట్ర పన్నింది ఈ 'ప్రౌడ్ బారు' తీవ్రవాద మూకలే. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గవర్నరు చర్యలు తీసుకుంటే, దానికి వ్యతిరేకంగా న్యూహాంప్‌షైర్ స్టేట్ హౌస్ మైదానంలో నిరసనకు దిగింది వీరే. అటువంటి ఫాసిస్టు శక్తులను ట్రంప్ గత మంగళవారం నాటి డిబేట్‌లో నిర్లజ్జగా ప్రశంసించాడు. ఎన్నికల ఫలితాలు తమకు ప్రతికూలంగా వస్తే తాను ఏం చేయబోయేదీ ట్రంప్ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకు అవసరమైన ప్రాతిపదికను ఇప్పటి నుంచే సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల్లో పెద్దయెత్తున రిగ్గింగ్ జరిగిందనో, పోస్టల్ బ్యాలెట్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయనో చెప్పి సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఆ కోర్టులో మెజార్టీ న్యాయమూర్తులు కన్సర్వేటివ్‌లే ఉండేలా చూసుకోవడం ద్వారా తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చూసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. కొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కన్సర్వేటివ్ అయిన ఎమీ కోనీ బారెట్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ట్రంప్ నియమించడంలో ఉద్దేశమిదే. ఎన్నికల పోలింగ్ సమయంలో ఆయుధాలు, పేలుడు సామగ్రి దొరకడం కష్టం కాబట్టి ముందే వీటిని కొనుగోలు చేసి భద్రపరచుకోవాలని ఈ గ్యాంగ్ పిలుపునివ్వడం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఫాసిస్టు పోకడలను అడ్డుకోకపోతే అమెరికాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అమెరికా కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నట్లు ఫాసిజాన్ని ఓడించాలంటే ట్రంప్‌ను ఇంటికి సాగనంపాల్సిందే.










