Dec 31,2022 16:34

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : మండలంలోని విపిఆర్ కండ్రిక పశువైద్యశాల పరిధిలో సక్రమంగా విధులు నిర్వహిస్తున్న పశువైద్యాధికారి డాక్టర్ నాగ శిరీష పై అసత్య ఆరోపణలు తగవని ఆసుపత్రి పరిధిలోని రైతులు కుమారస్వామి అమర్నాథరెడ్డి నరేష్ కుమార్ రెడ్డితో పాటు మహిళలు,పాడి రైతులు అధిక సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ నాగ శిరీష, డాక్టర్ ప్రతాప్ దంపతులు పశువులకు సంబంధించిన సమస్యల కోసం ఏ సమయంలో ఫోన్ చేసినా వెంటనే స్పందించి వైద్య సేవలు అందించి పశువుల ప్రాణాలు కాపాడుతున్నారని, అలాంటి వైద్యాధికారులపై ఉర్లగట్టుపోడు కాపు పల్లెకు చెందిన కొంతమంది డాక్టర్ శిరీష కు ఫోను చేయకుండానే ఫోన్ చేసినా స్పందించడం లేదని అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. నిరసన చేస్తున్న సమయంలో రైతు సలహా మండలి జిల్లా చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి ఎంపీడీవో కార్యాలయం వద్దకు రాగానే పాడి రైతులు మహిళలు పశువైద్యుల గురించి వారు అందిస్తున్న సేవలు గురించి సుకుమార్ రెడ్డికి వివరించి చెప్పారు.